సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Sep 15, 2020 , 02:59:35

కిసాన్‌ యూరియా వచ్చేస్తోంది..

కిసాన్‌ యూరియా వచ్చేస్తోంది..

  • నవంబర్‌ నుంచే మార్కెట్లోకి ఎరువులు
  • n రామగుండంలో తుది దశకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ 
  • n వచ్చే నెలలోనే ట్రయల్‌ రన్‌..  నవంబర్‌లోనే ఉత్పత్తి 
  • n రోజూ 2200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్‌ టన్నుల యూరియా తయారీ
  • n సర్వత్రా హర్షాతిరేకాలు 

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తికి కౌంట్‌డౌన్‌ మొదలవుతున్నది. స్వరాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ర్టాల ఎరువుల కొరత తీర్చే లక్ష్యంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో ట్రయల్‌ నిర్వహించి.. నవంబర్‌లో ఉత్పత్తి మొదలు పెట్టనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.                          - పెద్దపల్లి, నమస్తే తెలంగాణ

రామగుండంలో గతంలో బొగ్గు ఆధారితంగా నడిచి నష్టాలతో మూతపడ్డ ఎఫ్‌సీఐ స్థానంలో నిర్మించిన గ్యాస్‌ ఆధారిత ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తికి వేళవుతున్న ది. తెలంగాణతోపాటు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల ఎరువుల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఆరు సంస్థల భాగస్వామ్యంతో 6,120 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే 99.5 శాతం పనులు పూర్తి చేసుకొని, ఉత్పత్తి దశకు చేరింది. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, గ్యాస్‌ పైప్‌లైన్లు, సా మగ్రి కొరత, ఇతర స్థానిక సమస్యల కారణంగా ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రులు నిరంతరం ఆరా తీస్తూ, సమీక్షిస్తూ పనులను పరుగులు పెట్టించారు. 

నవంబర్‌లో ప్రారంభానికి సన్నాహాలు.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పూర్తయిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తికి అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. తాజాగా శనివారం ఫ్యాక్టరీని సందర్శించిన కేంద్రమంత్రులు నవంబర్‌లో ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రకటించారు. కిసాన్‌ బ్రాండ్‌ పేరుతో ఎరువులను మార్కెట్లోకి తీసుకువస్తామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించగా, అధికారులు వేగవంతం చేస్తున్నారు. అక్టోబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి, నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ప్లాంట్‌కు సంబంధించి మొత్తం 460మంది పర్మినెంట్‌ ఉద్యోగులకు గాను, ఇప్పటికే 278 మందిని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేశారు. మరికొంత మందిని త్వరలోనే భర్తీ చేస్తామని చెబుతున్నారు. కాగా, ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులను గతంలో స్వస్తిక్‌ లోగోతో విక్రయించగా, ఇప్పుడు కిసాన్‌ బ్రాండ్‌ పేరుతో మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాష్ట్ర సర్కారుకు 11శాతం వాటా..

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ఎరువుల ఉత్పత్తిలో అనుభవమున్న సంస్థలను కలుపుకొని నిర్మా ణం చేపడుతుండగా, సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్ర భుత్వానికి 11శాతం వాటా దక్కింది. తన ఆస్తులను బదలాయించిన ఎఫ్‌సీఐకి 11శాతం వాటా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌కు 26శాతం వాటాల చొప్పున 52 శాతం, డెన్మార్క్‌కు చెందిన హల్దర్‌ టాప్సే కంపెనీకి 11.7 శాతం, కర్మాగారానికి గ్యాస్‌ సరఫరా చేసే గెయిల్‌ సంస్థకు 14.3శాతం వాటా ఉంది. అయితే ఇందులో తన వాటా కింద కోట్లాది నిధులు పెట్టిన రాష్ట్ర సర్కారు, ప్లాంట్‌కు విద్యుత్‌, నీరు, ఇతర వసతులు కల్పిస్తూ, త్వరగా పూర్తి చేసేందుకు సహకారం అందించింది. 

ఉత్పత్తిలో 50శాతం రాష్ర్టానికే.. 

తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ర్టాల ఎరువుల అవసరాల కోసం ఏడాదికి 12.5లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఫ్యాక్టరీని నిర్మించారు. ఈ లెక్కన ప్రతి రోజూ 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా, 3,850మెట్రిక్‌ టన్నుల యూరియాను తయారీ చేస్తారు. కాగా, ఇందులో 50శాతం తెలంగాణ అవసరాలకు కేటాయించనుండగా, మిగతాది ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాలకు కేటాయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఫ్యాక్టరీ సమగ్ర స్వరూపం.. 

l 2016 ఆగస్టు 7న సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 

l పాత ఎఫ్‌సీఐకి చెందిన వెయ్యి ఎకరాల స్థలంలో ఆరు సంస్థల భాగస్వామ్యంతో 6,120కోట్ల భారీ వ్యయంతో పనులు చేశారు. 

l ఇప్పటి దాకా ప్లాంట్‌కు సంబంధించి రిమోవల్‌ ఏరియా, కంప్రెషర్‌ హౌస్‌, కూలింగ్‌ టవర్స్‌, కూలింగ్‌ వాటర్‌ పంప్‌ స్టేషన్‌, ఫ్లేర్‌ ఏరియా, గ్యాస్‌ రిసీవింగ్‌ టర్మినల్‌, ప్రైమరీ రిఫార్మర్‌, వాటర్‌ బ్లాక్‌ కంట్రోల్‌ రూంలు పూర్తికాగా, ఫ్యాక్టరీ నుంచి రాజీవ్‌ రహదారి దాకా రోడ్డు నిర్మాణం చివరిదశలో ఉంది. 

l కర్మాగారంలోని వివిధ విభాగాల్లో ట్రయల్‌ రన్స్‌ పూర్తయ్యాయి. 

l యూరియా తరలింపు కోసం అవసరమైన రైల్వేలైన్‌ నిర్మాణం కూడా కంప్లీట్‌ అయింది. 

l ముడి సరుకు రవాణా, ఉత్పత్తి తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే లైన్‌ సమీపంలో గౌతమి నగర్‌ వరకు ప్రత్యేక రహదారిని నిర్మించారు.

l ఫ్యాక్టరీకి కావాల్సిన విద్యుత్‌ కోసం 220కేవీ సామర్థ్యం గల స్విచ్‌ యార్డ్‌, సబ్‌ స్టేషన్‌ నిర్మించారు. 

l నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి 27కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేశారు.  

l గ్యాస్‌ సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌ నుంచి 360కిలో మీటర్ల మేర పైప్‌లైన్లు నిర్మించారు. 

l ఇప్పటి వరకు 99.5శాతం కర్మాగారం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి త్వరలోనే పూర్తిచేసి నవంబర్‌ 15లోగా ఉత్పత్తిని మొదలు పెట్టనున్నారు. 

l అగ్ని ప్రమాదాల నివారణ కోసం ముందస్తుగా మూడు భారీ అగ్నిప్రమాపక వాహనాలతో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

l గతంలో స్వస్తిక్‌ లోగోతో ఎరువుల విక్రయాలు చేపట్టగా, ప్రస్తుతం కిసాన్‌ లోగోతో అందించనున్నారు. 

l ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రధాన భాగస్వామ్య సంస్థ నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ యూరియాను మార్కెటింగ్‌ చేయనున్నది.