శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 11, 2020 , 03:04:55

క్షణం క్షణం.. భయం భయం

క్షణం క్షణం.. భయం భయం

  • n పులి సంచారంతో వణుకుతున్న పల్లెలు
  • n కొనసాగుతున్న అటవీశాఖ అన్వేషణ
  • n ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

ముత్తారం/కమాన్‌పూర్‌: పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు వారం రోజులుగా క్షణం క్షణం.. భయంభయంగా గడుపుతున్నారు. వారం క్రితం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి పెద్దపులి మండలంలోని అడవిశ్రీరాంపూర్‌ శివారులోని మానేరు వాగు దాటి కోయకుంట చెరువు మీదుగా అడవిలోకి ప్రవేశించింది. రెండు రోజులకు మచ్చుపేట అడవిలోని బగుళ్లగుట్టలో ప్రత్యక్షమైంది. ఆవుల మందపై దాడి చేసి ఒకదానిని చంపి ఐదింటిని గాయపరిచింది. మరుసటి రోజు ఆవు కళేబరాన్ని కొంత మేరకు తిని వెళ్లింది. దీంతో అటవీ అధికారులు దానిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చారు. కానీ, పులి మళ్లీ ఆ ప్రాంతానికి రాలేదు. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు, పోలీసులు బగుళ్లగుట్ట ప్రాంతానికి వెళ్లవద్దని సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, మండలంలోని మచ్చుపేట, లక్కారం గ్రామాలతోపాటు రామగిరి మండ లం బేగంపేట, నవాబ్‌పేట, నాగపెల్లి, రత్నాపూర్‌, సెంటినరీకాలనీ, కల్వచర్ల, రామయ్యపల్లి, లద్నాపూర్‌, ఆదివారంపేట గ్రామాల ప్రజలు ఐదు రోజులుగా భయం భయంగా గడుపుతున్నారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.  

గుండారంలోనూ పులి పాదముద్రలు

కమాన్‌పూర్‌ మండలం గుండారం గ్రామ రిజర్వాయర్‌ సమీప అటవీ ప్రాంత పరిసరాల్లో గ్రామ రైతులు గురువారం పులి అడుగులను గుర్తించారు. వీరి సమాచారం మేరకు వచ్చిన అటవీశాఖ సెక్షన్‌ అధికారి అమీరొద్దీన్‌, బీట్‌ ఆఫీసర్‌ ఆనందరావు, ఎంపీవో వాజీద్‌ పరిశీలన అనంతరం అవి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.  అలాగే బుధవారం రామగిరి మండలం రత్నాపూర్‌ శివారులోనూ పెద్దపులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. బగుళ్లగుట్ట నుంచి రత్నాపూర్‌ మీదుగా గుండారం అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, జిల్లాలో పులి సంచరిస్తున్నం దున సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ సూచిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం పంట చేలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, గుండారం శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ ఆకుల ఓదెలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.