మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Sep 10, 2020 , 03:39:36

30 ఏళ్లలో ఇదే తొలి సారి

30 ఏళ్లలో ఇదే తొలి సారి

  • lఒకే పులి సంచరిస్తున్నది lజిల్లాలో కేసీఆర్‌ విజన్‌తోనే దట్టంగా పెరిగిన అడవులు  lకరీంనగర్‌ సీసీఎఫ్‌ ఎంజే. అక్బర్‌..  lబగుళ్లగుట్ట సందర్శన

మంథని రూరల్‌/ముత్తారం: గత 30 ఏళ్లలో ఎన్నడూ ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రథమంగా పులి సంచరించడం ఇదే తొలిసారని కరీంనగర్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌ తెలిపారు. బుధవారం మండలంలోని ఎక్లాస్‌పూర్‌ చెక్‌ పోస్టు వద్ద గల క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్నారన్నారు. దానికి నిదర్శనమే ఎన్నడూ ఈ ప్రాంతానికి రాని పులులు సైతం ఈ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో సంచరిస్తున్నాయన్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి పులి సంచారం పెద్దపల్లి జిల్లాలోకి వచ్చిందన్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ముత్తారం మండలం మచ్చుపేట బగుళ్లగట్టలోని ఆవుల మందపై దాడి చేసిందన్నారు. ఈ ప్రాంతంలో ఆరు పులులు ఒకే సారి సంచరించే అవకాశాలు లేవని, ఒక్క పులి మాత్రమే సంచరించే అవకాశాలు ఉన్నాయన్నారు. గుంపులు గుంపులుగా పులులు సంచరించవని వివరించారు. అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా అడవిలోకి వెళ్లవద్దని కోరారు. పులులు సంచరిస్తున్నాయనే సమాచారంతో ఎవరైనా వాటికి హాని కల్గించాలని చూస్తే వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇటీవల పులి దాడిలో మృతి చెందిన ఆవుకు ఫారెస్టు శాఖ పరంగా నష్ట పరిహారం అందిస్తామన్నారు. అనంతరం ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామ అడవిలో రెండు రోజుల క్రితం పులి దాడిలో మృతి చెందిన ఆవు కళేబరాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఆయన వెంట పెద్దపల్లి డీఎఫ్‌వో రవిప్రసాద్‌, మంథని రేంజర్‌ షౌకత్‌అలీ, బేగంపేట సెక్షన్‌ ఆఫిసర్‌ నర్సయ్యతో పాటు సిబ్బంది ఉన్నారు. 

రామగిరిలోకి ప్రవేశించిన పులులు

రామగిరి /ముత్తారం : ముత్తారం మండలం బగుళ్ల గుట్ట ప్రాంతంలో ఆవుల మందపై దాడి చేసిన ఘటన తర్వాత పులి రామగిరిఖిల్లా ఆటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు ఆటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున రత్నాపూర్‌ గ్రామ శివారులోని శ్మశాన వాటిక ప్రాంతలోని రామగిరిఖిల్లా వైపు వెళ్లే దారిలో అక్కడి గ్రామ రైతులు పులి అడుగులను గుర్తించి ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కల్వచర్ల ఫారెస్ట్‌ సెక్షన్‌ అఫీసర్‌ ఆమ్రొద్దీన్‌, సబ్బితం ఎఫ్‌డీఓ ఆనందరావు రామగిరిఖిల్లా ప్రాంతానికి చేరుకొని అడుగులను గుర్తించి అవి కచ్చితంగా పులి అడుగులేనని వారు తేల్చి చెప్పారు.