శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 07, 2020 , 01:44:11

‘సహకార’ంలో సకల సేవలు

‘సహకార’ంలో సకల సేవలు

  •  రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పీఏసీఎస్‌ n అందుబాటులో రుణాలు, విత్తనాలు, ఎరువులు 

చొప్పదండి  : రైతులకు, ప్రభుత్వానికి వారధిలా ఉన్న సహకార సంఘం సేవలు వెలకట్టలేనివి.  సహకార సంఘం పరిధిలోని గ్రామాల్లో అన్నదాతలకు రుణాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సకాలంలో అందిస్తూ వారి మన్ననలు పొందుతున్నాయి.  చొప్పదండి సహకార సంఘ ంలో 2600 మంది సభ్యులు ఉన్నారు. అందులో 220 మంది దీర్ఘకాలిక రుణాలు, 1080 మంది  స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు.  సహకార సంఘంలో రుణాలు తీసుకున్న సభ్యులు సకాలంలో చెల్లిస్తూ సంఘాన్ని అభివృద్ధిబాట పట్టిస్తున్నారు. నూతన పాలకవర్గం సభ్యులు రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

దరఖాస్తు ఇచ్చిన వెంటనే రుణాలు..

  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి తోడు నూతనంగా ఎంపికైన పాలకవర్గం సభ్యులు రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేసి ఆర్థిక చేయూత ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

 అందుబాటులో విత్తనాలు, ఎరువులు

 సహకార సంఘం ఆవరణలో రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను సకాలంలో విక్రయిస్తూ పంటల ఎదుగుదలకు దోహద పడుతున్నారు. సహకార సంఘంలో క్రాప్‌లోన్‌ తీసుకున్న రైతుకు ఒక ఎకరాకు రూ.5వేల విలువైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలను ఒక రూపాయి వడ్డీతో  అప్పుగా అందజేస్తూ చేయూతనిస్తున్నారు.

 ధాన్యం కొనుగోళ్లతో ఆదాయం

 సహకార సంఘంద్వారా చేపట్టిన ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారా సొసైటీకి అధిక ఆదాయం వస్తున్నది. ఈ ఏడాది 66 వేల 56 క్వింటాళ్ల వరి ధాన్యం, 35వేల 857 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశారు. వరిధాన్యం కొనుగోలు పై సుమారు రూ. 21లక్షలు, మక్కల కొనుగోళ్లపై రూ. 3లక్షల 94వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

 112 మందికి రుణమాఫీ

 సహకార సంఘంలో రూ. 25వేల లోపు అప్పు ఉన్న 112 మంది సభ్యులకు రుణమాఫీ చేశారు. లక్షలోపు ఉన్న వారికి విడుతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు. అంతేకాక సంఘంలో సభ్యుడిగా ఉండి సహజంగా మరణిస్తే రూ.5వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10వేలు బాధిత కుటుంబసభ్యులకు అందజేసి భరోసానిస్తున్నారు.