సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Sep 07, 2020 , 01:44:21

సీతంపల్లి గుట్టల్లో పెద్దపులి

సీతంపల్లి గుట్టల్లో  పెద్దపులి

  • nగుర్తించిన అటవీశాఖ అధికారులు
  • nవారం రోజులుగా తూర్పు అడవుల్లో సంచారం
  • nబిడ్డతో పాటు ఆదివారం అడవిశ్రీరాంపూర్‌లోకి ప్రవేశం
  • nచుట్టు పక్కల గ్రామాల్లో అప్రమత్తం
  • nపెద్దపల్లి జిల్లాలో కలవరం
  • nఆందోళన చెందొద్దు : అదనపు కలెక్టర్‌
  • nఅప్రమత్తంగా ఉండాలి : డీఎఫ్‌వో

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ముత్తారం: మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మం డలం నిమ్మగూడెంలో వారం రోజుల క్రితం నూనావత్‌ సమ్మయ్యకు చెందిన ఆవును పులి చంపడంతో అక్కడ పెద్దపులి సంచారం విషయమై శాస్త్రీయ ఆధారాలను అటవీ శాఖ అధికారులు సేకరించారు. దాని అడుగులను గుర్తించి సంచరిస్తున్న విషయాన్ని నిర్ధారించారు. దీంతో వారం రోజులుగా సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ రోజు రాత్రి 30-40 కిలో మీటర్ల వరకు పులి నడుస్తుందనే ఉద్దేశంతో ఆయా గ్రామాల ప్రజలు రాత్రి పూట ఎటూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మహాముత్తారం మండలం, భూపాలపల్లి మండలం ఆజంనగర్‌ నుంచి మానేరు తీరం వెంట మల్హర్‌ మండలం కిషన్‌రావుపల్లి, తాడిచర్ల, కాపురంల మీదుగా కమలాపూర్‌ మండలం రాంపూర్‌ వైపు నుంచి చిట్యాల మండలం వెంచరామి, కాల్వపల్లి, సమ్మక్క గద్దె, పూరేడు గుట్టల సమీపంలో పులి సంచరిస్తున్నట్లు శుక్రవారం వరకు గుర్తించారు. తాజాగా, ఆదివారం ఉదయం తన బిడ్డతో కలిసి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌-ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిని దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లు డీఎఫ్‌వో రవిప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మానేరు తీర గ్రామాల్లో అటవీశాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అడవిశ్రీరాంపూర్‌ శివారులోని శీలం సది పొలంలో నిపుణులతో కలిసి పెద్దపులి అడుగులను గుర్తించి ధ్రువీకరించారు. ఓడేడు మానేరు ఇసుకలో సైతం తల్లి పులి, బిడ్డ పులి పాద ముద్రలను గుర్తించారు. అడవిశ్రీరాంపూర్‌-ఖమ్మంపల్లి గ్రామా ల మధ్య గల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి సీతంపల్లి గ్రామ పరిధిలోని పూరేడిగుట్టకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతం దానికి అనువైంది కావడం వల్ల ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాంతం ఒకవైపు మంథని మండలం గాజులపల్లి, మరోవైపు రామగిరి ఖిల్లా అటవీ ప్రాంతం ఉండడంతో పులి తిరిగి ఎటువైపు వెళ్తుందనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. 

అవతలి ఒడ్డున చూశామంటున్న ప్రజలు.. 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌, ఓడేడ్‌ గ్రామాల్లోని అనేక మంది రైతులకు మానేరు అవతలి ఒడ్డున సైతం పంట పొలాలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి, పూరేడు గుట్ట, సమ్మక్క గద్దెలు, మల్హర్‌ మండలం కాపురం, తాడిచర్ల గ్రామ శివారుల్లోకి వారు తరచూ వెళ్లి వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాము పెద్దపులిని చూశామని రైతులు తెలియజేయడంతో వారి వద్ద నుంచి జిల్లా అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని సేకరించారు. 

అనువుగా అటవీ ప్రాంతం

మంథని నియోజకవర్గంలో 198 కిలోమీటర్ల అటవీ ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోయింది. స్వరాష్ట్రంలో వనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టడంతోపాటు వనాలను ధ్వంసం చేస్తున్న, వన్యప్రాణులను వేటాడుతున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించడం.. ఒకవైపు గోదావరి, మరో వైపు మానేరు నదులు, ఎగువన నిర్మించిన కాళేశ్వరం లింక్‌-1 ప్రాజెక్టుల కారణంగా వన్య ప్రాణి జాతులకు అనువైన ప్రదేశంగా ఉన్న తూర్పు అడవులకు చేరుకుంటున్నాయి. దీంతో పులులు వాటి వేట కోసం వస్తున్నట్లు తెలుస్తోంది.

నేడు నాలుగు సీసీ కెమెరాల ఏర్పాటు..

ముత్తారం మండలం సీతంపల్లి కోయగుట్టలో పెద్దపులి తల్లీపిల్లా ఉన్న నేపథ్యంలో గుట్ట చుట్టూ, సమీప గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు డీఎఫ్‌వో వివరించారు. ఈ మేరకు రామగుండం నుంచి సోమవారం తీసుకువచ్చి సీసీ కెమెరాలను బిగించనున్నట్లు పేర్కొన్నారు.

సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అడవులు నిండుగా ఉండడంతో వన్య ప్రాణులు వస్తుండగా, వాటి వేటకు పులులు సంచరిస్తున్నాయి. ఏడేళ్ల కిందట వన సంపదను కాపాడాల్సిన అప్పటి ప్రభుత్వాలు స్మగ్లర్లపై చర్యలు తీసుకోకపోవడంతో అటవీ సంపద తరగిపోయింది. దీంతో వన్యప్రాణులు, జంతువులు వలస వెళ్లాయి. ఏడేళ్ల క్రితం 2013 అక్టోబర్‌ 12న మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి నాగారం -గుంజపడుగు గ్రామాల మధ్యలో ఎస్సారెస్పీ కాల్వలను ఆనుకొని పత్తి చేను గట్టుపై కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌ తీగకు చిక్కుకొని చిరుత మృతి చెందింది. ఈ ఘటన అప్పుడు సంచలనం రేపగా, ఎడారి ప్రాంతమైన గుంజపడుగు ఏరియాకు చిరుత ఎలా వచ్చిందనే అనుమానం వచ్చింది. అడవులు అంతరించిపోవడం వల్లే ఎడారి ప్రాతానికి వచ్చిందన్న చర్చ జరిగింది. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవడంతోనే ప్రస్తుతం అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. 

అప్రమత్తంగా ఉండాలి

-జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్‌ యాదవ్‌

మానేరు తీర గ్రామాల్లో తల్లి పులి, బిడ్డ పులి సంచరిస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీఎఫ్‌వో రవిప్రసాద్‌ యాదవ్‌ కోరారు. ఎక్కడ పులి కదలికలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాద ముద్రలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండడంతో అవి ఆడ పెద్దపులివని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. పక్కాగా అవి ఖమ్మంపల్లి పరిధిలోని కోయగుట్టలోనే ఉన్నాయన్నారు. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌, ఖమ్మంపల్లి, మైదంబండ, మచ్చుపేట, ముత్తారం మండలం ధర్మారం, గాజులపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గొడ్డూగోదను సైతం బయటికి వదలవద్దని, ప్రజలు సైతం బయట తిరగవద్దని సూచించారు. పులితో ఎలాంటి ఆస్తి నష్టం జరిగినా తాము పరిహారం అందిస్తామన్నారు. సీతంపేట అడవిలోని జలపాతానికి పర్యాటకులు రావద్దన్నారు. పులి జనావాసాల్లోకి వస్తే రెస్క్యూ బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలిస్తామని పేర్కొన్నా రు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. 

ఆందోళన చెందొద్దు

-అదనపు కలెక్టర్‌ వీ లక్ష్మీనారాయణ

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో అటవీ శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, ప్రజలు అందోళన చెందొద్దని అదనపు కలెక్టర్‌ వీ లక్ష్మీనారాయణ సూచించారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌తో పాటు, గాజులపల్లి, మైదంబండ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పెద్దపులి అనవాళ్లు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అయా గ్రామాలు, పరిసర గ్రామాల ప్రజలు మేకలు, గొర్రెలు, ఇతర జంతువులను అడవుల్లోకి మేతకు తీసుకెళ్లవద్దని సూచించారు. అలాగే పెద్దపులికి హాని కలిగించవద్దన్నారు.