బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Sep 06, 2020 , 02:35:26

సరిహద్దులో పులి సంచారం

సరిహద్దులో పులి సంచారం

  • n ప్రత్యక్షంగా చూసిన ఓడేడు రైతులు
  • n భయాందోళనతో పరుగులు
  • n పాదముద్రలు సేకరించిన అధికారులు

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ముత్తారం: జయశంకర్‌ భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లా సరిహద్దులో పులి సంచరించింది. మండలంలోని ఓడేడు రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం మానేరు ఆవల ఉన్న పొలాల వద్దకు ఓడేడు గ్రామానికి చెందిన రైతు రత్న స్వామి, మరో ఇద్దరు వెళ్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మానేరు సరిహద్దు సమీపంలో ఉన్న పూరేడుగుట్ట వద్ద వీరికి పులి కనిపించింది. దీంతో వారు భయంతో పరుగులు తీసి గ్రామానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం జయశంకర్‌ భూపాపల్లి జిల్లా చిట్యాల మండలం వెంచారామి అటవీ ప్రాంతంలో పులి అడుగులను రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు అక్కడికి వెళ్లి పులి అడుగులను గుర్తించారు. దీంతో పులి మానేరు సరిహద్దులోనే తిరుగుతున్నదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం కూడా జయశంకర్‌ భూపాపల్లి జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తంతో పాటు రేంజ్‌ అధికారి, సిబ్బంది పులి అడుగులను గుర్తించారు. పులి ముత్తారం మండలంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉన్నందున రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారు లు ఎప్పటికప్పుడు పులి ఆనవాళ్లను సేకరిస్తున్న ట్లు మంథని రేంజ్‌ ఆఫీసర్‌ షౌకత్‌ అలీ తెలిపారు. 

అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్‌వో

ఓడేడు మానేరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్‌ యాదవ్‌ సూచించారు. శనివారం ఆయన ఓడేడు మానేరు వాగులో పరిశీలించారు. మండల ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దన్నారు. 20 ఏండ్ల తర్వాత ఈ ప్రాంతంలో పెద్దపులి కనిపించిందన్నారు. ఆయన వెంట మంథని రేంజ్‌ ఆఫీసర్‌ చౌరత్‌ అలీ, బేగంపేట సెక్షన్‌ ఆఫీసర్‌ నర్స య్య, సర్పంచ్‌ సిరికొండ బక్కారావు, ఉపసర్పం చ్‌ దేవునూరి భానుకుమార్‌ తదితరులున్నారు.