సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Sep 05, 2020 , 01:54:08

చోరీలకు పాల్పడుతున్నదొంగల అరెస్టు

చోరీలకు పాల్పడుతున్నదొంగల అరెస్టు

ఫర్టిలైజర్‌సిటీ  : వ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న 12 మంది ని గోదావరిఖని సబ్‌ డివిజనల్‌ ఏసీపీ ఉమేందర్‌, వన్‌ టౌన్‌ సీఐ రమేశ్‌, రెండో సీఐ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఫైవింక్లయిన్‌ చౌరస్తా వద్ద పట్టుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ తెలిపారు. వీరిలో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం గోదావరిఖని వన్‌ టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. ముఠాగా ఏర్పడ్డ వీరు మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకొని రాత్రి సమయాల్లో ఇనుప రాడ్లతో తలుపులు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతుండేవారన్నారు. చోరీ చేసిన సొత్తును అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారని చెప్పారు. ఫైవింక్లయిన్‌ చౌరస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో అనుమానాస్పదంగా ఉండగా, ఏసీపీ ఉమేందర్‌ ఆదేశాల మేరకు సీఐలు, క్రైం పార్టీ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిపై గోదావరిఖని వన్‌ టౌన్‌ పరిధిలో 5, టూ టౌన్‌ పరిధిలో 3 మొత్తం 8 కేసులు నమోదు చేయగా, నిందితులు మొత్తం 16 ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డట్లు వెల్లడించారు. ఆగస్టు 14, 15 రాత్రి ఒక్కరోజే 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 25 తులాల బంగారం, 40 తులాల వెండి, 5 టీవీలు, ఒక ల్యాప్‌ టాప్‌, రూ. 30వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.