బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Sep 04, 2020 , 02:08:18

సస్యరక్షణతో పంటలకు మేలు

సస్యరక్షణతో పంటలకు మేలు

  • lవరి, పత్తి పంటలకు  పొంచి ఉన్న చీడపీడలు, తెగుళ్లు
  • lనివారణ చర్యలతో  నాణ్యమైనదిగుబడులు

హుజూరాబాద్‌ రూరల్‌: సాగులో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు కీలకం. పంటలను చీడపీడలు, తెగుళ్ల నుంచి కాపాడుకున్నప్పుడే నాణ్యమైన దిగుబడులు సాధ్యం. ప్రస్తుతం రైతులు ఎక్కువగా వరి, పత్తి పంటలు వేయగా, తాటాకు పురుగు, కాండం తొలిచే పురుగులతోపాటు తెగుళ్లు, గట్లపై ఎలుకల బెడద పొంచి ఉంది. ఈ క్రమంలో రైతులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై హుజూరాబాద్‌ మండల వ్యవసాయాధికారి సునీల్‌ కుమార్‌ సలహాలు, సూచనలు ఇచ్చారు.

వరిలో తాటాకు పురుగు నివారణ

వరిలో తాటాకు పురుగుల వల్ల ఆకుల చివర్లు పాలిపోయి, చిట్లిపోతాయి. ఆకులపై తెల్లని చారలు ఏర్పడుతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీ లీటర్లు లేదా క్లోరి పైరిఫాస్‌ 3నుంచి 5 మి.లీ. లేదా, ఫ్రోఫెనోపాస్‌ 2.0 ఎంఎల్‌ను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీంతో తాటాకు పురుగును నివారించవచ్చు. 

కాండం తొలుచు పురుగు.. 

ఇది ఆశిస్తే మొగి ఆకు వాడిపోయి రాలిపోతుంది. దీని నివారణకు నాటిన 25 నుంచి 35 రోజుల మధ్య మొదటి కలుపు తీసిన తరువాత పటేరా గుళికలు 4 కిలోలు లేదా ప్యూరిడాన్‌ గుళికలు 10 కిలోలు ఎకరానికి బురద పదనులో చల్లి, ఏ మడికి ఆ మడిలో నీళ్లు ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మొగి పురుగులు ఆశించినట్లయితే కార్టఫ్‌ ఐడ్రో క్లోరెడ్‌ 50 ఎస్‌పీ పౌడరన్‌ 300 గ్రాములు ఎకరానికి నీళ్లలో కలిపి మొక్క మొదటి భాగం తడిచేలా పిచికారీ చేయడం వల్ల పురుగును నివారించవచ్చు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు వరదలో మునిగిన వరిపంటకు కాండం కుళ్లు తెగులు వస్తే వాలీడమాగ్భిన్‌ లేదా కాంటఫ్‌ తెగులు మందును పిచికారీ చేయాలి. 

ఎలుకల నివారణకు చర్యలు

వరిపంటలో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పొలం ఒడ్లపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని రాత్రి పూట బయటకు వచ్చి వరి మొదలును కొరుకుతాయి. దీంతో పంట పొలాలు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. వీటి నివారణకు బ్రోమె డైయాలోన్‌ మందును  దంచిన బియ్యం, వంట నూనె మిశ్రమంలో కలిపి వాటి కలుగుల వద్ద ఉంచడం వల్ల వాటి బెడద తగ్గిపోతుంది. ఎలుకల నివారణకు మందు పెట్టినప్పుడు పొలంలో నీళ్లు లేకుండా చూసుకోవాలి.

పత్తిలో రసం పీల్చే పురుగు దాని నివారణ

ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉన్నది. ఇప్పుడు రసం పీల్చే పురుగు ఉధృతి పెరుగుతుంది. దీని నివారణకు లీటర్‌ నీటికి మోనోక్రోటోపాస్‌ 1.6 మిల్లీ లీటర్లు లేదా అస్పెట్‌ 1.5 గ్రాములు లేదా ఫిఫ్రోనిల్‌ 2.0 ఎంఎల్‌ లేదా ఇబిడాక్లోఫ్రిడ్‌ 200 ఎంఎల్‌, లేదా ఎసీటామఫ్రిడ్‌ 0.2 గ్రాము లేదా థాయే మిథాక్సమ్‌ 0.2 గ్రాము లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా రసం పీల్చే పురుగును నివారించవచ్చు. అంతేకాకుండా కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా కురువడంతో వేరుకుళ్లు రోగం ఆశిస్తుంది. దీని నివారణకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు నిల్వ ఉండడంతో తేమ శాతం పెరుగుతుంది. అందుకే నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసి బయటకు పంపించాలి.