శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Sep 02, 2020 , 02:48:26

జేఈఈ మెయిన్స్‌ ప్రారంభం

జేఈఈ మెయిన్స్‌ ప్రారంభం

  • lవాగేశ్వరీ, విట్స్‌ ఇంజినీరింగ్‌  కళాశాలల్లో సీబీటీ పరీక్ష
  • l579 మంది హాజరు.. l320 మంది గైర్హాజరు

తిమ్మాపూర్‌ : దేశ వ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని అయాన్‌ డిజిటల్‌ సెంటర్‌, వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, అలాగే కరీంనగర్‌లోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ పరీక్షలు మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. మొత్తం మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం కలిపి 899 మందికి ఏర్పాట్లు చేయగా 579 మంది హాజరు కాగా, 320 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని వాగేశ్వరీలోని అయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో 668 మందికిగానూ 460 మంది హాజరు కాగా, 208 మంది గైర్హాజరయ్యారు. వా గేశ్వరీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఉదయం 140 మందికిగానూ 91మంది హాజరుకాగా, 49 మంది గైర్హాజరయ్యారు. అలాగే కరీంనగర్‌లోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఉదయం 91 మందికి 28 మంది హాజరుకాగా, 63 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రం ఆవరణలో విద్యార్థులతో చేతులను శుభ్రం చేయించడంతోపాటు ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. పరీక్షకు ముందు విద్యార్థులను గంటన్నర ముందు లోనికి అనుమతించగా, కేంద్రం వద్ద మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖీచేసి లోనికి అనుమతించారు. పరీక్షకు ముందు, తర్వాత పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్‌ చేశారు. పరీక్ష కేంద్రాన్ని సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లలితాకుమారి, అబ్జర్వర్లు సీహెచ్‌ విజయ్‌కుమార్‌, ఎం తిరుపతిరెడ్డి, రాధారపు సూర్య ప్రకాశ్‌ పర్యవేక్షించారు.