శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 01, 2020 , 02:25:19

సీఎం కేసీఆర్‌ వల్లే తూముల నిర్మాణం

సీఎం కేసీఆర్‌ వల్లే తూముల నిర్మాణం

  •  nప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె  కృషి గొప్పది
  •  nముఖ్యమంత్రిని విమర్శించేస్థాయి మేడిపల్లి సత్యంకు లేదు
  •  nరామడుగు సింగిల్‌విండో చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు: వరదకాలువకు తూముల నిర్మాణాలు సీఎం కేసీఆర్‌ వల్లే ప్రారంభమవుతున్నాయని రామడుగు సింగిల్‌ విండో చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఇందుకు రూ. 248 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు. తూముల నిర్మాణంతో రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాలు సస్యశ్యామలం కానున్నాయని పేర్కొన్నారు. ఇందుకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కృషి గొప్పదని కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మోతె ప్రాజెక్టును తెరమీదికి తీసుకురాగా నాటి నుంచి సుమారు రెండు దశాబ్దాలపాటు ముంపు గ్రామాలైన కొరటపల్లి, షానగర్‌, రామడుగు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారన్నారు. మోతెకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించడంలో సుంకె, వినోద్‌కుమార్‌ కృషి మరువలేనిదన్నారు. వినోద్‌కుమార్‌ ఎంపీగా ఓటమిపాలైనప్పటికీ నియోజవర్గ ప్రజలకు అండగా నిలిచారని ప్రశంసించారు. రవిశంకర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో రామడుగు మండలానికి చెందిన రిటైర్డ్‌ సీఈ పొల్సాని వెంకట్రామారావు చర్చించారని చెప్పారు. ప్రతి చేనుకూ నీరందించేందుకు ఉప కాలువలు నిర్మించడం గొప్ప విషయమన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత మేడిపల్లి సత్యం ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వ, శిఖం భూములు కబ్జాకు గురవుతుంటే, వాటిని కాపాడేందుకు వెళ్లిన అధికారులపై దాడిచేసి సంబంధిత భూములను ఆక్రమించుకున్న వ్యక్తులకు వత్తాసు పలుకుతూ ఈరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. కమీషన్లపై మాట్లాడాలంటే అది నీగురించే మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఇకనైనా విమర్శించేముందు చదువుకున్న వ్యక్తిలా ఆలోచించాలన్నారు. వరదకాలువకు ఏర్పాటు చేసే తూముల నిర్మాణంపై కాంగ్రెస్‌ నాయకులకు అవగాహన లేదన్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే ఎన్నో అనుమతులు అవసరం ఉంటుందని, దానిలో భాగంగానే కాలువల నిర్మాణపనుల్లో కొంత ఆలస్యం జరిగిందన్నారు. మోతె ప్రాజెక్టు రద్దు కాకుండా దానికి అనుసంధానంగా మరో ప్రాజెక్టును నిర్మించరాదనే చిన్న సాంకేతిక సమస్యవల్ల ఆలస్యమైందేకాని మరో విషయం కాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. మేడిపెల్లి సత్యానికి ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే రెండుసార్లు ఓటమిని రుచి చూపించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యంకు లేదన్నారు. కేసీఆర్‌ ముమ్మాటికీ తెలంగాణ ప్రజల పాలిట అపర భగీరథుడిగా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.  ఇక్కడ ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్‌ వొంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు కలిగేటి లక్ష్మణ్‌ ఉన్నారు.