శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Aug 31, 2020 , 00:17:36

కరోనా మృతుల నుంచి వైరస్‌ సోకదు

కరోనా మృతుల నుంచి వైరస్‌ సోకదు

కమాన్‌పూర్‌: కరోనా వైరస్‌తో చనిపోయినవా రి మృతదేహాల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందదని, అంత్యక్రియల నిర్వహణలో కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రాకపోవడం సరికాదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన  ఓ వృద్ధురాలికి (70) ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు పుట్ట మధూకర్‌, ట్రస్టు చైర్మన్‌ తులసిగారి (బిట్టు) శ్రీను ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ బారినపడిన వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వచ్చిన వారితో ప్రేమతో వ్యవహరించాలని కోరారు. వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి అంత్యక్రియలకు కుటుంబీకులు, బంధువులు దూరంగా ఉండడం సరికాదన్నారు.  ఆ దిశగా ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు నీలం శ్రీనివాస్‌, తాటికొండ శంకర్‌, రాచకొండ రవి,  ఇంతియాజ్‌, ఎండీ కలీమొద్దీన్‌, గుర్రం లక్ష్మిమల్లు, దామెర సంపత్‌, ఎలబోయిన రామ్మూర్తి, జాబు సతీశ్‌ తదితరుల్గున్నారు.

కరోనా బాధితులకు మధు పరామర్శ

కమాన్‌పూర్‌: మండలంలోని రొంపికుంట సర్పంచ్‌ కట్కం రవీందర్‌, కమాన్‌పూర్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చిందం తిరుపతితోపాటు పలువురికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించగా, హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారిని జడ్పీ అధ్యక్షుడు పుట్ట మధూకర్‌ ఆదివారం పరామర్శించారు. అధైర్యపడవద్దని, మందులు  సక్రమంగా వాడాలని సూచించారు. అలాగే గుండారం గ్రామంలో కూడా పలువురు కరోనా బాధితులను మధూకర్‌ పరామర్శించారు.