శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Aug 24, 2020 , 01:39:16

పలుకరిస్తూ.. ధైర్యం నింపుతూ

పలుకరిస్తూ.. ధైర్యం నింపుతూ

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: ‘కరోనాను జయించాలంటే సూది మందులు.. ఆక్సిజన్‌.. వెంటిలేటర్లే కానక్కరలేదు.. మనోధైర్యాన్ని మించిన మందు మరొకటి లేదు..’ అని అన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌. తాను కరోనా నుంచి కోలుకున్న తర్వాత నియోజకవర్గంలో వైరస్‌ బారిన పడ్డ వారిని పలుకరిస్తూ.. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ భయం వద్దని ధైర్యం కల్పిస్తున్నారు. కరోనా బాధితులంటేనే అటువైపు చూసేందుకే జంకుతున్న ఈ రోజుల్లో ఆయన స్వయంగా రామగుండం డిప్యూటీ మేయర్‌ అశోక్‌రావు, వైద్యులతో కలిసి గోదావరిఖని ప్రభుత్వ ఏరియా దవాఖానలోని వార్డులకు వెళ్లి పలుకరిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారిని ఓదార్చుతున్నారు. ధైర్యంగా ఉంటే వైరస్‌ ఏమీ చేయదని అభయమిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులను అభినందిస్తున్నారు. ఇటీవలే వైరస్‌ నుంచి కోలుకున్న ఎమ్మెల్యే చందర్‌ కొవిడ్‌ వార్డుల్లో సందర్శించవద్దని వైద్యులు సూచించినా ప్రజా సేవే పరమావధిగా ముందుకు కదులుతున్నారు. గోదావరిఖని ఏరియా దవాఖానలో 30 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉండగా ప్రస్తుతం 13 మంది వైద్యం పొందుతున్నారు. కాగా, వారం రోజుల నుంచి ఎమ్మెల్యే కరోనా బాధితుల వద్దకు వెళ్లి ఓదార్పునిస్తుండడంతో వైరస్‌ బారి నుంచి త్వరగా కోలుకుంటామన్న ధైర్యం బాధితుల్లో కనిపిస్తున్నది.

ప్రజా సేవే పరమావధి.. - కోరుకంటి చందర్‌, రామగుండం ఎమ్మెల్యే

అత్యంత సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టిన నాకు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ప్రాణం కంటే కూడా ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్నా. కరోనాతో బాధ పడ్డా. కోలుకున్న తర్వాత నాకు తెలిసింది ఒక్కటే. వైద్యం కంటే కూడా మనో ైస్థెర్యమే గొప్ప వైద్యమని. అందుకే ఈ విషయాన్ని కొవిడ్‌ బాధితులందరికీ చెప్పాలనుకుంటున్న. భయపడాల్సిన పని లేదు. దీర్ఘకాలికమైన వ్యాధులున్న వారు కోలుకోవచ్చు. ధైర్యంగా ఉంటే ఏ వైరస్‌ ఏమీ చేయలేదు. మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు. ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు.  జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వైద్యం అందుకుంటున్న వారందరినీ కలిసి ధైర్యం చెప్పా. సీఎం   కేసీఆర్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు భరోసాను కల్పించాలని నిర్ణయించడంతోనే వార్డుల సందర్శనకు శ్రీకారం చుట్టా.