ఆదివారం 25 అక్టోబర్ 2020
Peddapalli - Aug 24, 2020 , 01:39:17

చేపల జాతర

చేపల జాతర

  • పార్వతీ బరాజ్‌ గేట్లు మూసివేతతో బండల్లో ఇరుక్కున్న చేపలు
  • తండోప తండాలుగా తరలివచ్చిన రెండు జిల్లాల ప్రజలు
  • బస్తాలకు బస్తాలు.. ఆటోలు, ద్విచక్రవాహనాల్లో తరలింపు

మంథని రూరల్‌ : పార్వతీ బరాజ్‌ గేట్లు మూసి వేయడంతో ఆదివారం పుష్కలంగా చేపలు లభించాయి. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన 50 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఆదివారం ఉదయం నుంచి విడతలవారీగా గేట్లు మూసివేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పూర్తిస్థాయిలో మూసివేయడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన చేపలు బండలు, ఇసుకలో ఇరుక్కుపోయాయి. విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు తండోప తండాలుగా ప్రాజెక్టు వద్దకు సంచులతో చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని వేలాల, కిష్టాపూర్‌, కుందారం, బెజ్జాల, శెట్‌పల్లితోపాటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల, సుందిళ్ల, సిరిపురం గ్రామాల మహిళలు, చిన్నారులు, యువకులు, వృద్ధులు, పిల్లతల్లులు జాతరలా తరలివచ్చారు. దాదాపు ఆరు వందల మందికిపైగా వచ్చి చేపలను మూటలు, సంచుల్లో పట్టుకుని ఆటోలు, ద్విచక్రవాహనాల్లో ఇండ్లకు తరలించారు. చుట్టాలు. పక్కాలు, స్నేహితులకు ఫోన్లు చేసి పిలిపించుకుని మరీ వాటిని తీసుకువెళ్లడం గమనార్హం.logo