శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Aug 21, 2020 , 02:14:17

అనాథ చిన్నారులకు అండగా ఉంటా..

అనాథ చిన్నారులకు అండగా ఉంటా..

శంకరపట్నం: తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారిన శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన అభియన, ఆలయకు పెద్దన్నలా అండగా ఉంటానని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ భరోసానిచ్చారు. ఏడు నెలల్లోనే చిన్నారుల తల్లిదండ్రులు రమేశ్‌-శారద మరణించడం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ముక్కుపచ్చలారని చిన్నారులు అనాథలుగా మారడం తనను కలచివేసిందన్నారు. వారిని చదివించే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, త్వరలోని వచ్చి చిన్నారులను స్వయంగా కలుస్తానని చెప్పారు. 

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..

తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అభినయ (11), ఆలయ (9) అనాథలుగా మారారు. ఎరడపల్లి గ్రామానికి చెందిన నాగుల రమేశ్‌-శారద దంపతులు హోటల్‌ నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఉన్నంతలో బతుకు బండిని సాఫీగా లాగిస్తున్న వారి కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఏడు నెలల క్రితం రమేశ్‌ గుండెపోటుతో మృతి చెందాడు.  ఈ నెల 16న శారద అనారోగ్యంతో కన్ను మూసింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలు ఒంటరివారయ్యారు. తల్లిదండ్రుల తరఫు బంధువులెవరూ చేరదీసేవారు లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకువచ్చి సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

చిన్నారులను ఆదుకుంటాం..

శంకరపట్నం: అనాథ చిన్నారులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలోం, రూరల్‌ సీఐ ఎర్రల కిరణ్‌ తెలిపారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు అభినయ, ఆలనను గురువారం వారు పరామర్శించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్వింటాలు బియ్యం, రూ. 5 వేల నగదును ఆర్డీవో చేతుల మీదుగా అందజేశారు. ఇక్కడ తహసీల్దార్‌ జగత్‌సింగ్‌, ఎస్‌ఐ వరంగంటి రవి, తదితరులున్నారు.