ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 21, 2020 , 02:14:18

టీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనం

టీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనం

కార్పొరేషన్‌ : కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, మెరుగైన సేవలు, పరిపాలన తీరుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులే నిదర్శనమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న నూతన విధానాలు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తీసుకువచ్చే వినూత్న పథకాలతోనే కరీంనగర్‌ నగరపాలక సంస్థకు ఈ ర్యాంకులు వచ్చాయన్నారు. ఈ ఘనత పూర్తిగా ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్‌ కుగ్రామంగా అనేక సమస్యలతో, నిధులు లేక ఇబ్బందులు పడిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ నగరానికి రూ.వందల కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. వీటితో పకడ్బందీగా అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. వాటి ఫలితంగానే ఈ ర్యాంకులు వచ్చాయని, దేశంలోనే 72వ ర్యాంకు రావడంతోపాటు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఇన్నోవేటివ్‌ విభాగంలో జాతీయ స్థాయిలో నంబర్‌వన్‌గా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. 2014 నుంచి నగరాన్ని ‘క్లీన్‌ అండ్‌ నీట్‌ సిటీ’గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేసిందన్నారు. దీని కోసం 14 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులను అభివృద్ధి చేశామని, అంతర్గత రోడ్లను నిర్మించామన్నారు. గతంలో ప్రధాన రహదారులను కార్మికులు ఊడ్చేవారని, ఇప్పుడు రూ.1.50 కోట్లతో మూడు స్వీపింగ్‌ యంత్రాలను తీసుకువచ్చి క్లీనింగ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు 40 స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టామన్నారు. చెత్త తరలింపుకు కంప్యాటర్లు తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పుడు అండర్‌ గ్రౌండ్‌ డైనేజీలో చెత్త పేరుకపోకుండా ఉండేందుకు వీలుగా జెట్టింగ్‌ యంత్రాలను తీసుకువచ్చామని చెప్పారు. నగరంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వేగంగా జరుగుతుందని, చాలా మంది నగరం నీట్‌గా ఉందన్న కితాబు కూడా ఇస్తున్నారని తెలిపారు. తాము ఓట్ల రాజకీయాల కోసం కాకుండా రోడ్లపై ఉన్న ఆక్రమణలన్నింటినీ తొలగించి, నీట్‌గా మార్చామన్నారు. డంప్‌యార్డు పాపం తమది కాదని, అయినా త్వరలోనే పూర్తిగా క్లీన్‌ చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో రోజూ నీటి సరఫరా చేస్తున్నామని, రాబోయే రోజుల్లో 24 గంటలు అందిస్తామన్నారు. జాతీయ స్థాయిలో 10 లోపు స్థానాన్ని సాధించేందుకు మరింత కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, కమిషనర్‌ క్రాంతికి మంత్రి స్వీట్లు తినిపించారు. సమావేశంలో కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, ఐలేందర్‌యాదవ్‌, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.