శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Aug 19, 2020 , 02:43:26

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

రామడుగు: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా  పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు, తదితర అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాతో పాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలన్నారు. మురుగు నీరు నిలిచి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. దోమల నివారణకు ఫాగింగ్‌ చేయించాలన్నారు. మండలంలో 23 గ్రామ పంచాయతీలుండగా ఇప్పటి వరకు కేవలం నాలుగు గ్రామాల్లో మాత్రమే వైకుంఠధామాలు పూర్తి కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 గ్రామ పంచాయతీలకు కేవలం ఐదు గ్రామాల్లో మాత్రమే సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణం పూర్తి కావడం సరికాదన్నారు. అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ వైస్‌ ఎంపీపీ పూరెల్ల గోపాల్‌, ఎంపీవో సతీశ్‌రావు, ఏపీవో చంద్రశేఖర్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.