బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Aug 17, 2020 , 02:04:24

కూలిన ఇండ్లు... అప్రమత్తమైన అధికారులు

కూలిన ఇండ్లు... అప్రమత్తమైన అధికారులు

కోల్‌సిటీ: నాలుగు రోజులుగా వర్షం ఆగడం లే దు. దీంతో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం తడిసి ముద్దయింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు నగర పాలక సంస్థ కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో  సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుద్ధ్య సిబ్బందితో చర్యలు చేపడుతున్నారు. సప్తగిరి కాలనీ, ఫైవింక్లయిన్‌, 7 బీ కాలనీ, తిలక్‌నగర్‌ డౌన్‌, అడ్డగుంటపల్లి, దుర్గానగర్‌, గంగానగర్‌, విఠల్‌నగర్‌తోపాటు కింది స్థాయి డివిజన్లలో వర్షపు నీరు ఇండ్లలోకి రాగా, ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఓదెల:  వర్షంతో పాత ఇండ్లు గోడలు నాని కూ లుతున్నాయి. పలు గ్రామాల్లో వరద నీరు పొలాల పై నుంచి వెళ్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొలనూర్‌, ఉప్పరపల్లి, గోపరపల్లిల్లో మత్తడుల వద్ద గ్రామస్తులు కూడా చేపలను చిన్న చిన్న వలలు, కట్టెలతో కొడుతూ పట్టుకుంటున్నారు. నిం డిన చెరువులు చూసేందుకు గ్రామస్తులు ఆసక్తిగా తరలివెళ్తున్నారు. పలు చెరువు కట్టలకు ప్రమాదం పొంచి ఉండగా, తహసీల్దార్‌ రాంమోహన్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

ఎలిగేడు: వర్షాలకు మండలంలోని పలు గ్రామా ల్లో ఇండ్లు కూలాయి. దీంతో తహసీల్దార్‌ పద్మావతి, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ మండిగ రేణుక రాజనర్సయ్య, ఆర్‌ఐ శ్రీనివాస్‌తో కలిసి ఆయా గ్రామా ల్లో పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో పోలాడి మంజుల, గోపగోని రవీందర్‌, బుర్హాన్‌మియాపేటలో సయ్యద్‌ ఖాసీంకు చెందిన కూలిన ఇండ్లను పరిశీలించారు. అలాగే ఎలిగేడులోని అక్కచెరువు, మద్దుల చెరువు, ధూళికట్టలోని ఊర చెరువులను పరిశీలించారు.  

సుల్తానాబాద్‌రూరల్‌: నీరుకుళ్ల, గట్టేపల్లి శివారులోని మానేరువాగుతోపాటు చిన్నకల్వలలోని హుస్సేన్‌మియా వాగులో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కదంబాపూర్‌లోని ఎర్ర చెరువు కట్ట తెగిపోవడంతో డీఆర్వో నర్సింహమూర్తి ఆదివారం పరిశీలించారు. వెంటనే కట్టకు మరమ్మతు చేయాలని సర్పంచ్‌ కోడెం సురేఖ, స్థానిక రైతులకు సూచించారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు కోడెం అజయ్‌, రైతులు ఎక్స్‌కవేటర్‌ సహాయంతో గండిని పూడ్చివేయించారు. అలాగే రేగడిమద్దికుంట ఊర చెరువు మత్తడి తెగిపోయి శ్మశాన వాటిక పనులు జరుగుతున్న ప్రాంతంలోని ఇసుక, సామగ్రి వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయిందని ఆ గ్రామ సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి చెప్పారు. 

పెద్దపల్లి రూరల్‌/పెద్దపల్లి కల్చరల్‌: పెద్దపల్లి మండలంలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నా యి. అలాగే తుర్కలమద్దికుంట అనుబంధ గ్రామం గొల్లపల్లిలో కత్తెర్ల లచ్చయ్య పెంకుటిల్లు వర్షానికి నాని కూలిపోయింది. ఆ సమయంలో పెంకుటిల్లు ఆవరణలో ఆవు ఉండగా దానికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత కుటుంబాన్ని వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచ్‌ తంగెళ్ల జయప్రద సంజీవరెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు హబీబ్‌ ఉర్‌ రెహమాన్‌ పరామర్శించారు. పెద్దపల్లి శివారులోని బంధంపల్లి చెరువు ముసురు వర్షంతో పూర్తిగా నిండి, మత్తడి దుంకుతున్నది. 

జూలపల్లి : వర్షాలతో వడ్కాపూర్‌ గ్రామానికి చెం దిన మాంకాలి పోచయ్య, కంది శ్రీనివాస్‌, కన్నం రాజలింగం, కంది రాము ఇండ్లు కూలి పో యాయి. పోచయ్య తన ఇంటిలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా పై కప్పు కూలింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. వడ్కాపూర్‌-ధూళికట్ట మధ్య హుస్సేన్‌మియా వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పలు గ్రామా ల్లో వరి, పత్తి, మక్క, కూరగాయల తోటలు నీట మునిగాయి. వాగులు, వంకలు, ఒర్రెలు, చెరువు లు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. చేద, వ్యవసాయ బావులు పూర్తిస్థాయిలో నిండాయి.

కాల్వశ్రీరాంపూర్‌ : వర్షాలతో హుస్సేన్‌మియావాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెద్దరాత్‌పల్లి మట్టలవాగు పరీవాహక ప్రాంతం వెంట ఉన్న పొలాలు నీటమునిగాయి. జాఫర్‌ఖాన్‌పేట-మంగపేట మధ్యన ఉన్న మద్దులవాగు కల్వర్టు పైనుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గంగారంలో కనుకుంట్ల కొండయ్య పూరిల్లు కూలిపోయింది. 

పాలకుర్తి: పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండలాల్లోని చెరువు, కుంటలు నిండాయి. కాలువులు నిండుగా ప్రవహిస్తున్నాయి. పాలకుర్తి మండ లం ఈసాలతక్కళ్లపల్లి పెద్దచెరువు నిండింది. 

మంథనిటౌన్‌/ మంథని రూరల్‌: మంథని డివిజన్‌లో 186.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మంథనిలో 45.3మి.మీ, రామగిరిలో 32.5, కమాన్‌పూర్‌లో 45.4, ముత్తారంలో 63.1 మి.మీ వర్షం కురిసింది. నిరంతర వర్షాలతో మంథనిలోని గోదావరి నదితో పాటు రెడ్డి, అయ్యగారి, రావుల, తమ్మ, బన్నె, బర్రెకుంట, శీలా సముద్రం చెరువులు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. పట్టణ శివారులోని బొక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. లైన్‌గడ్డలోకి వరద నీరు వస్తున్నది. మంథని మండలం ఆరెంద, మల్లారం, వెంకటాపూర్‌, నాగేపల్లి, స్వర్ణపల్లి, అడవిసోమన్‌పల్లి, గోపాల్‌పూర్‌, చిన్న ఓదాల గుండా మానేరు నది నిండుగా ప్రవహిస్తున్నది. 

కమాన్‌పూర్‌:  కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తా రం, మంథని మండలాలకు వరప్రదాయనిగా పేరొందిన గుండారం జలాశయం నిండుకుండలా మారింది. మత్తడి దూకి అలుగు పారుతున్నది. రిజర్వాయర్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని నిలిపివేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. కమాన్‌పూర్‌ పెద్ద చెరువులో సమృద్ధిగా నీరు చేరడంతోపాటు మత్తడి పారుతున్నది. ఈ చెరువు కరకట్ట ప్రమాదకరంగా మారింది. అలాగే జూలపల్లి, రొంపికుంట, నాగారం, లింగాల, పేరపల్లి, పెంచికల్‌పేటల్లోని 14 చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.

ఫర్టిలైజర్‌సిటీ: ఎన్టీపీసీ పట్టణంలోని ఇందిరమ్మకాలనీ, ఖాజీపల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో బస్తీ రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ప్రగతి నగర్‌లో ఉప్పు నర్సమ్మ, కర్నాటి సీత ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో సామగ్రి తడిసి పోయాయి.  వంట పాత్రలు నీటిలో తేలాయి. టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురా లు సీతక్క, కమిషనర్‌తోపాటు డయల్‌ 100కు సమాచారం అందించారు. దీంతో రామగుండం బల్దియా కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, రామగుండం తహసీల్దార్‌ రవీందర్‌ చేరుకొని, పరిస్థితిని చక్కదిద్దారు. వర్షం నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ముత్తారం: ముత్తారం మండలంలోని ముత్తారం, కేశనపల్లి, పోతారం, పారుపల్లి, ఓడేడు, ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్‌, తదితర గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అలుగు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానేరు నిండుగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లోని పొలాల్లో నీరు చేరింది. మచ్చుపేటలో చెరువుకు గండి పడింది. ఓడేడు, అడవిశ్రీరాంపూర్‌, మచ్చుపేట, ముత్తారం తదితర గ్రామాల్లో దాదాపు పది ఇండ్లు కులిపోయాయని తహసీల్దార్‌ వెంకటలక్ష్మి తెలిపారు.