మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Aug 17, 2020 , 01:51:12

చెరువులు, కుంటల పరిస్థితులపై పర్యవేక్షణ కొనసాగించాలి

చెరువులు, కుంటల పరిస్థితులపై పర్యవేక్షణ కొనసాగించాలి

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/కమాన్‌పూర్‌: అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ ఆదేశించారు. మండల, గ్రామీణ స్థాయిలకు చెందిన వివిధ శాఖల అధికారులతో కమాన్‌పూర్‌లోని తహసీల్‌ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో  నిండుతున్నాయని పేర్కొన్నారు. వాటి పరిరక్షణ చర్యల్లో భాగంగా వాటిలోని నీటిని కొంతమేరకు ఎప్పటికప్పుడు తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రామగిరి మండలం బేగంపేటలోని రసూల్‌ కుంట, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేటలోని నల్లకుంటలకు మాత్రమే గండి పడ్డాయన్నారు. అందుకు సంబంధించిన మర్మమతు పనులు కూడా చేపడుతున్నా మని వివరించారు. జిల్లాలో భూ సమస్యలపై 1,20,000 ఫిర్యాదులు రాగా,  ఇప్పటి దాకా 90 వేలకు పైగా పరిష్కరించామని తెలిపారు. భారీ వర్షాలకు జిల్లాలో 45 ఇండ్లు పాక్షికంగా, 9 సంపూర్ణంగా దెబ్బతినడంతో అధికారులు వారికి పునరావాసం కల్పించారని చెప్పారు. పంట నష్టం అంచనాపై వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి హెడ్‌క్వార్టర్‌లో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో కమాన్‌పూర్‌ తహసీల్దార్‌ పాల్‌సింగ్‌, ఎంపీడీవో వాజిద్‌, ఏఈవో శ్రీనివాస్‌, ఎస్సారెస్పీ వర్కింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజన్న తదితరులు ఉన్నారు. 

మంథనిటౌన్‌: మంథని ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్‌ అనుపమరావుతో పా టు, ఆర్‌ఐలు, వీఆర్వోలు, వీఆర్‌ఏలతో అదనపు కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు వారికి కేటాయించిన గ్రామాల్లో అందుబాటులో ఉండాలని, వర్షాల కారణంగా ఇండ్లు, చెరువులు, కుంటలు, పంటలు దెబ్బతింటే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. నష్టాలు ఏర్పడితే వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.

డీఆర్వో సమీక్ష..

ఓదెల: వర్షాల కారణంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఓదెల రెవెన్యూ సిబ్బందితో కార్యాలయంలో డీఆర్వో నర్సింహమూర్తి ఆదివారం సమీక్ష జరిపారు. వరద నీటితో చెరువులు, కుంటలు ప్రమాదానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువు కట్టలు, రోడ్డులకు సంబంధించిన ఏమైనా ప్రమాదాలు ఉంటే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయాలని కోరారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమీక్షలో తహసీల్దార్‌ రాంమోహన్‌, నయాబ్‌ తహసీల్దార్‌ వసంతరావు, గిర్దావర్‌లు వినయ్‌కుమార్‌, రాజేందర్‌, వీఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.  

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..

ముత్తారం: మానేరు పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంథని ఆర్డీవో కృష్ణవేణి సూచించారు. ఓడేడులో మానేరు తీరాన్ని ఆమె ఆదివారం పరిశీలించారు. పారుపల్లి, ముత్తారం, ఓడేడు, అడవి శ్రీరాంపూర్‌, ఖమ్మంపల్లి తదితర గ్రామాలవాసులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలపై సర్వే చేయిస్తానని చెప్పారు. ఆమె వెంట తహసీల్దార్‌ వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు.

పెద్దపల్లిరూరల్‌: కరోనా వైరస్‌ విజృంభణ, ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి మండల ప్రజలు అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని ఎంపీపీ బండారి స్రవంతి సూచించారు. పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీపీ ఆదివారం మాట్లాడుతూ, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు గ్రామాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు సహా య చర్యలు అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్‌ నంబర్లు 90009 13593, 77021 69991, 90328 02596ను సంప్రదించాలని ఎంపీపీ పేర్కొన్నారు. 

ఓపెన్‌ప్లాట్లలో నిల్వ నీరు తొలగింపు

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి పట్టణంలోని 19, 34వ వార్డుల పరిధిలోని ఓపెన్‌ ప్లాట్లలో నీరు నిల్వ ఉండడంతో కమిషనర్‌ తిరుపతి ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఆదివారం తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యవసర సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. పారిశుద్ధ్య సేవల కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాంమోహన్‌ ( 91009 02530), పీ రాజు (91009 02543)ను, నీటి సరఫరా, స్ట్రీట్‌ లైట్స్‌ సమస్యల పరిష్కారానికి వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ మీర్‌(83411 93633), ఎలక్ట్రీషియన్‌ రాంచందర్‌(91009 02354), ఫిట్టర్‌ ఎండీ షఫీ(91009 02351)లో సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు. కమిషనర్‌ వెంట నాయకులు ప్రశాంత్‌, అష్రఫ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాంమోహన్‌, రాజు తదితరులున్నారు.