మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Aug 16, 2020 , 01:53:57

వర్షబీభత్సం

వర్షబీభత్సం

  • lఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు
  • lఎడతెరిపిలేకుండా జల్లులు
  • lకరీంనగర్‌ జిల్లాలో కుండపోత
  • lపొంగుతున్న మానేరు, మోయతుమ్మెద వాగులు
  • (కరీంనగర్‌/రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ)

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు, నివాస ప్రాంతాలు, పంట పొలాలు జలంతో నిండి కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా సగటున 10.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్‌లో అత్యధికంగా 19.5 సెంటీ మీటర్ల వర్షం పడింది. చిగురుమామిడిలో 18.1, సైదాపూర్‌లో 16.6, ఇల్లందకుంటలో 14.8, శంకరపట్నంలో 14.7, మానకొండూర్‌లో 14.3, జమ్మికుంటలో 13.7, తిమ్మాపూర్‌లో 12.4, గన్నేరువరంలో 11.1, వీణవంకలో 11.0 సెంటీ మీట ర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో 6.04 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 12.5 సెంటీ మీటర్లు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం గా 4.72 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో 10.21 సెంటీ మీటర్లు  పడింది. జగిత్యాల జిల్లాలో 18 మండలాల పరిధిలో సాధారణ వర్షం కురిసింది. శనివారం ఉదయం వరకు 1.62 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

పొంగి పొర్లుతున్న వాగులు..

మానకొండూర్‌, వీణవంక, జమ్మికుంట మండలాల పరిధిలోని మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండ లం నుంచి ప్రారంభమయ్యే మోయతుమ్మెద వాగు గత 30 ఏండ్ల తర్వాత భారీ వరదతో ఉప్పొంగుతున్నది. చిగురుమామిడి, తిమ్మాపూర్‌ మండలాల మీదుగా ప్రవహించి ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో కలుస్తున్నది. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, అర్కండ్ల వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 30 ఏండ్లలో ఇంతటి వరద చూడ లేదని స్థానికులు తెలిపారు. ఈ వాగులు కల్వల ప్రాజెక్టు మీదుగా కల్వల వాగులో కలుస్తుండడంతో ఈ వాగు కూడా భారీ వరదతో పరవళ్లు తొక్కుతున్నది. హుజూరాబాద్‌లోని చిలుక వాగు నిన్నటి నుంచే పొంగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ముస్తాబాద్‌ మండలంలోని నక్కవాగు, కోనరావుపేట, వేములవాడ మండలాల్లోని మూలవాగులు పొంగి పొర్లుతున్నాయి. గంభీరావుపేట మండ లం నర్మాల ఎగువ మానేరులోకి కూడెల్లి, పాల్వంచ వాగులు పరుగులు పెడుతున్నాయి. 32 అడుగుల సామర్థ్యం గల మానేరు ప్రాజెక్టు  17 అడుగులకు చేరింది. వర్షం ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో పూర్తి స్థాయి సామర్థ్యానికి నీరు చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తా రం, మంథని మండలాల మీదుగా మానేరు నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మంథని మండలం అడవిసోమన్‌పల్లి వంతెన వద్ద మానేరు బ్రిడ్జికి కేవలం నాలుగు ఫీట్ల మేరకు మాత్రమే ఖాళీగా ప్రవహిస్తున్నది. మానేరు వరదతో మంథని మండలం ఆరెంద, వెంకటాపూర్‌ గ్రామాల్లోని పంట పొలాలు వరదలో కూడుకుపోయాయి. మంథని వద్ద బొక్కలవాగు సైతం వరద నీటితో పరవళ్లు తొక్కుతూ గోదావరిలో కలుస్తున్నది. దీంతో దిగువన ఉన్న సరస్వతీ బరాజ్‌కు సంబంధించిన 54 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో ముత్తారం మండలం మచ్చుపేట వద్ద రసూల్‌కుంటకు గండిపడింది. జూలపల్లి మండలంలో హుస్సేన్‌మియా వాగు సైతం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నది. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం భూషణరావుపేట శివారులోని రాళ్లవాగు ప్రాజెక్టు జలకళను సంతరించుకోగా, కుడికాలువ ద్వారా నీళ్లు వదిలారు.

నిలిచిన రాకపోకలు..

భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గన్నేరువరం మండల కేంద్రం చుట్టు పక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతుండడంతో ఈ గ్రామానికి వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. గుండ్లపల్లి దేవుని చెరువు, కొండాపూర్‌ పటేల్‌ చెరువులు మత్తళ్లు దూకుతుండడంతో ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. చొక్కల్లపల్లి, పీచుపల్లికి వెళ్లే మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. గన్నేరువరం నుంచి కరీంనగర్‌ వెళ్లే మార్గంలో కల్వర్టులు పొంగి పొర్లుతున్న కారణంగా రాకపోకలు నిలిచి పోయాయి. మానకొండూర్‌ మండలంలోని గంగిపెల్లి, వెల్ది, లక్ష్మీపూర్‌ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచి పోయా యి. శంకరపట్నం మండలంలోని అనేక గ్రామాల్లోని నివాస గృహాల్లోని వరద వచ్చింది.

మత్తళ్లు దుంకుతున్న చెరువులు..

చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం చెరువులు, కుంటలు 1,376 ఉండగా 853 మత్తళ్లు దూకుతున్నాయి. 293 చెరువులు వంద శాతం నీళ్లతో నిండాయి. పెద్దపల్లి జిల్లాలో 229 చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. మరో 291 చెరువుల్లో 75-100శాతంగా నిండాయి. సిరిసిల్ల జిల్లాలో 86 చెరువులు మత్తడి దూకుతున్నాయి. జగిత్యాల జిల్లాలో 52 చెరువులు వంద శాతం నిండి మత్తడి పడుతున్నాయి. 170 చెరువుల్లోకి 75 శాతం విస్తీర్ణం మేర నీరు చేరుకున్నది.  

ఎల్‌ఎండీకి భారీ వరద..

మోయతుమ్మెద వాగు ఉధృతంగా వస్తుండడం తో ఎల్‌ఎండీలోకి భారీగా వరద వస్తోంది. శనివారం ఉదయం 60 వేల క్యూసెక్కులు రాగా, సాయంత్రానికి 43 వేలకు తగ్గింది. కాగా, ఎస్సారెస్పీ సీఈ శంకర్‌ అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ప్రస్తుతం 12.746 టీఎంసీలు నిల్వ ఉందని, ఈ ఒక్క రోజే 3 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు తెలిపారు. గంటకోసారి నీటి నిల్వలను పరిశీలిస్తూ సీఎం కార్యాలయానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

పలుచోట్ల నష్టం..

హుజూరాబాద్‌ మండలం ఇప్పల్‌నర్సింగాపూర్‌ సమీపంలో పౌల్ట్రీ రైతు గుర్రాల కరుణాకర్‌రెడ్డికి చెందిన నాలుగు వేల కోళ్లు చనిపోయాయి. అదే గ్రామానికి చెందిన గుంపుల కొంరయ్య అనే రైతుకు చెందిన మూడు దుడ్డెలు వరదలో కొట్టు కు పోయాయి. దమ్మక్కపేట సమీపంలోని మసీద్‌ గోడ, తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల కంపౌండ్‌ వాల్‌ కూలిపోయాయి. శంకరపట్నం మండలం కొత్తగట్టులోని ఎడ్ల రాజు, తిరుపతికి చెందిన ఫౌల్ట్రీ ఫాంలోకి వరద నీరు చేరడంతో మూడు వేల కోళ్లు మృతి చెందాయి.