శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Aug 14, 2020 , 03:17:31

గురు దక్షిణ

గురు దక్షిణ

గురువంటే.. భవిష్యత్‌కు మార్గదర్శి. సరైన మార్గంలో నడిపించే దిక్సూచి. అలా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడికి పూర్వవిద్యార్థులు గురుదక్షిణ చెల్లించారు. కరోనా లాక్‌డౌన్‌తో స్కూళ్లు మూతపడి, తమ సారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని చలించిపోయారు. తలా కొంత పోగు చేసి, టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయించి ఉపాధి చూపారు.

- కథలాపూర్‌ 

కథలాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన హన్మాండ్ల రఘు ఎంఏ, బీఎడ్‌ చేశాడు. ఆయనకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. రుద్రంగిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 1992 నుంచి 2008 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇదే సమయంలో ప్రభుత్వోద్యోగం ప్రయత్నించినా రాలేదు. ప్రైవేట్‌ స్కూల్‌లో వచ్చే వేతనంతో కుటుంబ పోషణ కష్టమైంది. తప్పనిపరిస్థితుల్లో గల్ఫ్‌ బాట పట్టాడు. అక్కడ సరైన ఉపాధి లేక కొద్దిరోజులకే తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. 2010 నుంచి కథలాపూర్‌ మండలం తాండ్య్రాలలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరాడు. కరోనా వల్ల మార్చి నుంచి ప్రైవేట్‌ స్కూల్స్‌ మూతపడడంతో మళ్లీ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న 40 మంది ఇటీవలే రుద్రంగి జడ్పీ హైస్కూల్‌ 1997-98 ఎస్సెస్సీ బ్యాచ్‌ విద్యార్థులు చలించిపోయారు. సుమారు లక్ష జమ చేసి, టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించారు. కథలాపూర్‌ మండలం అంబారిపేట ఎక్స్‌రోడ్డు వద్ద రేకులషెడ్డు నిర్మించారు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి అందించారు. ఈ టిఫిన్‌ సెంటర్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు కలిసి ప్రారంభించారు. 


రుణం తీర్చుకోలేనిది..

మా సార్‌ ఆర్థిక కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని 1997-98 ఎస్సెస్సీ బ్యాచ్‌ విద్యార్థులం చలించి పోయినం. గురుదక్షిణగా ఏదైనా చేయాలని అనుకున్నం. అందరం కలిసి డబ్బులు పోగు చేసినం. టిఫిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయించినం. గురువులకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిది. గురువుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నం.

సంతోషంగా ఉన్నది..

నా పూర్వ విద్యార్థులు ఇప్పటివరకు నన్ను గుర్తుంచుకోవడం సంతోషంగా ఉన్నది. గురువు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నరు. ఆర్థిక సాయం చేసి, టిఫిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయించిన్రు. వారి సహకారం మరువలేనిది. వారికి నా అభినందనలు. వారు చేసిన సహకారం మరువలేనిది. 

- హన్మాండ్ల రఘు, ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు