గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Aug 14, 2020 , 03:17:31

కాళేశ్వర ఝరి

కాళేశ్వర ఝరి

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ధర్మారం/రామడుగు/బోయినపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1,2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మంథని మండలం కాసిపేట వద్ద ఉన్న సరస్వతీ పంప్‌ హౌస్‌లోని 7 మోటర్లను ఆన్‌ చేసి 20,300 క్యూసెక్కుల నీటిని ఎగువన గల పార్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో పార్వతీ బరాజ్‌లో 8.83టీఎంసీల సామర్థ్యానికి గాను 6.35టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంతర్గాం మండలం గోలివాడ వద్ద ఉన్న పార్వతీ పంప్‌ హౌస్‌లోని 9 మోటర్లను ఆన్‌ చేసి 23,490 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి కాళేశ్వరం లింక్‌-2లోని ధర్మారం మండలం నంది పంపు హౌస్‌లోని 2,3,4,5,7 మోటర్లను ఆన్‌ చేసి 15,750 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. ఒక్కో మోటర్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 5 మోటర్ల ద్వారా 15,750క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది. డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా విడుదలైన నీరు నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నది. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌ గాయత్రీ పంప్‌హౌస్‌లో బుధవారం వరకు 1,2,4,6,7 పంప్‌లను ప్రారంభించి నీటిని ఎత్తిపోయగా గురువారం ఒకటో పంపును నిలిపివేసి 2,3,4,6,7 పంపుల ద్వారా నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. మొదట పది టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు గురువారం సాయంత్రానికి 11 టీఎంసీల నీటిని ఎస్సారార్‌కు తరలించారు. కాగా ఎస్సారార్‌ జలాశయానికి 16వేల 904 క్యూసెక్కుల నీరు చేరినట్లు ఇంజినీరింగ్‌ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 16.034 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. కురుస్తున్న వర్షాలకు 1,158 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్‌లోకి చేరిందని వెల్లడించారు. కాగా నీటి ఎత్తిపోతలను ఎప్పటికప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌, ఏఈలు పర్యవేక్షిస్తున్నారు. 

ఎల్లంపల్లిలో 11.819 టీఎంసీల నీరు   

జ్యోతినగర్‌(అంతర్గాం): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గురువారం ఉదయం 6గంటల వరకు 11.819 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నీటి మట్టం 148మీటర్లకు గాను 144.58 మీటర్లకు చేరిందన్నారు. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న పార్వతీ పంప్‌హౌస్‌కు 23,490 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. 25,916 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 16,378 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉందన్నారు.