మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 12, 2020 , 02:56:50

పార్కుల అభివృద్ధిపై బల్దియా దృష్టి

పార్కుల అభివృద్ధిపై బల్దియా దృష్టి

  •  నగరంలో స్థలాల గుర్తింపు
  •  ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పాలకవర్గం

కార్పొరేషన్‌: నగరంలోని పార్కు స్థలాల అభివృద్ధిపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. పార్కు స్థలాలను గుర్తించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదం పంచేలా ఆధునీకరిస్తున్నారు. ఈ విషయంలో మేయర్‌ వై సునీల్‌రావు ప్రత్యేక  చొరవ తీసుకుంటున్నారు. నగరంలో పార్కు స్థలాలను గుర్తించాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. వాటిలో హరితహారంలో భాగంగా అందమైన పూల మొక్కలు నాటడంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలోని పలు డివిజన్లలో పార్కు స్థలాలు, బల్దియా స్థలాల పేరిట బోర్డులున్నా వాటిని వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు విలువైన ఈ స్థలాలను గుర్తించి ప్రజల అవసరాలకు అనుగుణంగా పచ్చదనం నింపే దిశగా చర్యలు చేపడుతున్నారు. 

పార్కుల్లో పచ్చదనంతో పాటు ఆహ్లాదం

నగరంలో సుమారు 36కు పైగా ఉన్న బల్దియా స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే జడ్పీ క్వార్టర్స్‌లోని పార్కు స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్ది వినియోగంలోకి తీసుకువచ్చారు. అలాగే, జ్యోతినగర్‌లోని పార్కు స్థలాన్ని కూడా అభివృద్ధి చేస్తుండగా... పనులు చివరి దశలో ఉన్నాయి. వీటితో పాటు పలు కాలనీల్లో ఉన్న పార్కు స్థలాలకు గతంలోనే ప్రహరీ నిర్మించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో స్మార్ట్‌సిటీ నిధులతో పలు పార్కుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటితో పాటు ఇతర డివిజన్లలోని పార్కు స్థలాల్లో పిల్లలు ఆడుకోవడానికి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు వీలుగా సౌకర్యాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటి కోసం త్వరలో నిర్వహించే సర్వసభ్య సమావేశంలో సుమారు రూ. 2 కోట్ల మేరకు నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మానేరు డ్యాం సమీపంలో స్మృతి వనం నిర్మించేందుకు ఇప్పటికే స్థల పరిశీలన పూర్తి చేశారు. శివారు డివిజన్లలో ప్రభుత్వ స్థలం సేకరించి  పార్కును అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా నగరపాలక సంస్థ చేపడుతున్నది. ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.


logo