సోమవారం 28 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 11, 2020 , 00:58:40

గలగలా గాయత్రి

గలగలా గాయత్రి

ఆగస్టు 11, 2019..  ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమై మధురానుభూతిని మిగిల్చిన రోజు.. బీడు భూములు ‘కాళేశ్వరం’ జలాలతో తడిసిన రోజు.. రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిన రోజు.. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌లో బాహుబలి మోటర్‌ వెట్న్‌ ట్రయల్న్‌ విజయవంతంగా నిర్వహించి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ‘నమస్తే’ కథనం..

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంపుహౌస్‌ ప్రధాన భూమిక పోషించింది. సుమారు 640 ఎకరాల్లో ఐదు వేల కోట్లతో ప్రపంచ సాగు నీటి రంగంలో ఇప్పటి వరకు ఎక్కడా చేపట్టని విధంగా దీనిని నిర్మించారు. ధర్మారం మండలం నంది రిజర్వాయర్‌ గేట్లను ఎత్తడంతోనే జంట సొరంగాల ద్వారా 15.373 కిలోమీటర్లు ప్రయాణించి నేరుగా గాయత్రి పంపుహౌస్‌ సర్జ్‌పూల్‌కు నీరు చేరేలా ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు రూపకల్పన చేశారు. ఒక్కో సొరంగం 10 మీటర్ల చుట్టు కొలత కలిగి ఉండగా, గాయత్రి పంపుహౌస్‌ పరిధిలో 4.133 కిలోమీటర్ల సొరంగమార్గం ఉంది. 

అన్నీ ప్రత్యేకతలే..

ఇక్కడ మూడు సర్జ్‌పూల్స్‌ ఏర్పాటు చేయగా, సముద్ర మట్టానికి 230 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉంది. సర్జ్‌పూల్‌ సుమారు 60 మీటర్ల ఎత్తుతో 6 లక్షల 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉంది. భూ ఉపరితలానికి 150 మీటర్ల అడుగుల్లో పంపుహౌస్‌  ఉంటుంది. గాయత్రి పంపుహౌస్‌లో మొత్తం ఏడు బాహుబలి మోటర్లు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని వీటితో ఎత్తిపోయవచ్చు. ఇక్కడ ఒకవైపు ఐదు, మరోవైపు రెండు మోటర్లతో మొత్తం ఏడు పంపులకు రెండు డెలివరీ సిస్టర్నులు నిర్మించారు. స్వదేశీ పరిజ్ఞానంతో  బీహెచ్‌ఈఎల్‌ తయారు చేసిన బాహుబలి మోటర్లు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా వినియోగించలేదు. ఒక్కో మోటర్‌ 139 మెగావాట్లతో 214 ఆర్పీఎం (రివల్యూషన్‌ ఫర్‌ మినట్‌) ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని సుమారు 115 మీటర్ల లోతునుంచి ఎత్తిపోస్తుంది. 

ప్రత్యేకంగా సబ్‌స్టేషన్‌ 

బాహుబలి మోటర్లను నడిపించేందుకు గాయత్రి పంపుహౌస్‌ ఆవరణలో నాలుగు వందల కిలోవాట్ల సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. బాహుబలి పంపులు జలాలను డెలివరీ సిస్టర్నుల వద్ద ఎత్తిపోయగా గాయత్రి పంపుహౌస్‌ నుంచి సుమారు 5.7 కిలోమీటర్ల దూరంలో శ్రీరాములపల్లి శివారులో వరద కాలువకు 99.025 కి.మీ. వద్ద జంక్షన్‌ పాయింట్‌ నిర్మించారు. పంపుహౌస్‌ నుంచి కాళేశ్వరం జలాలు వరద కాలువకు చేరుకొని అక్కడి నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వెళ్తాయి. రామడుగు మండలం షానగర్‌ శివారులో వరద కాలువకు 103 కిలో మీటర్‌ వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి గేట్లను కిందికి దించడంతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ నుంచి 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న మల్యాల మండలం రాంపూర్‌ పంపుహౌస్‌కు జలాలు తరలుతాయి.

పెరిగిన సాగు 

గాయత్రి పంపుహౌస్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత రామడుగు మండలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మండలంలోని పలు పరీవాహక గ్రామాల రైతులు ప్రత్యక్షంగా, సుమారు ఐదువేల మంది పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. కాళేశ్వరం జలాలు గ్రావిటీ కాలువతో పాటు వరదకాలువలో సంవత్సరం పొడవునా నిలిచి ఉండడంతో రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని పంటలు వేసుకుంటున్నారు. కొందరు కాలువలకు నేరుగా మోటర్లను ఏర్పాటు చేసుకోగా, కొన్ని పరీవాహక గ్రామాల్లో భూగర్భ జలాలు ఉబికివచ్చి బావులు, చెరువులు నిండడంతో రైతులు నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను కాళేశ్వరం జలాలతో నింపారు. కరువు నేలను కాళేశ్వరం జలాలు సస్యశామలం చేయగా పాడి పంటలతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. 

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితమే.. 

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగానే నేడు కాళేశ్వరం జలాలు రాష్ట్రమంతటికీ చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇచ్చిన రైతుల త్యాగం గొప్పది. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో మూడేండ్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 70శాతం వరకు నీటి సరఫరా జరుగుతోంది. ‘కాళేశ్వరం’ నిర్మాణంలో మొదటి నుంచి నేను విధులు నిర్వహిస్తున్నా. ఈ ప్రాజెక్టు ఈఎన్సీగా వ్యవహరించడం గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.-నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు 

ఇంజినీరుగా చాలా గర్వపడుతున్నా..

కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఈగా విధులు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. సంవత్సరం క్రితం గాయత్రి పంపుహౌస్‌లో మొదటిసారి వెట్‌ ట్రయల్న్‌ల్రో భాగంగా బాహుబలి మోటర్‌ నీటిని ఎత్తిపోసిన సమయంలో చాలా ఆనందం కలిగింది. పగలనకా, రాత్రనకా ప్రభుత్వ ఆదేశాల మేరకు అహర్నిశలు శ్రమించి సుమారు 115 మీటర్ల లోతులోంచి నీటిని పైకి తీసుకొచ్చిన సమయంలో కష్టాన్నంతా మరిచిపోయినం. మా లాంటి ఇంజినీర్లు ఎంతోమంది ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టులాంటి గొప్ప అవకాశం మాకే లభించడం మా అదృష్టంగా భావిస్తున్నా.  -నూనె శ్రీధర్‌, ఈఈ, కాళేశ్వరం ప్రాజెక్టు 

 అదృష్టంగా భావిస్తున్నా

దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, జాతి గర్వించేలా చేపట్టిన ఇంతగొప్ప భారీ ప్రాజెక్టులో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నా విధి నిర్వహణలో ఇదో కీలక ఘట్టం. ప్రపంచ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. నేడు రాష్ట్రం నలుమూలలా కాళేశ్వరం జలాలు వెళ్తూ సస్యశ్యామలం చేస్తున్నాయి. ఇంతటి మహాభాగ్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.   -కొట్టె సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ, కాళేశ్వరం ప్రాజెక్టు 

రైతు కుటుంబాల్లో సంతోషం కనవడుతోంది..

నేను సుమారు ఎనిమిదేండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న. నాకు 14 ఎకరాల భూమి ఉంది.  గ్రావిటీ కాలువ నుంచి పైపులైన్‌ వేసుకున్నం. తొమ్మిది ఎకరాల్లో వరి, ఒక ఎకరంన్నరలో పత్తి సాగు చేస్తున్న. మిగితాది మామిడితోట ఉంది. ఈ సారి నీళ్లు పుష్కలంగా ఉన్నందున వరి దొడ్డురకం ఎకరానికి 25 క్వింటాళ్లు, సన్నరకం 20 నుంచి 22 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దత్తోజీపేటలో సుమారు వందమంది వరకు రైతులు కాలువకు పైపులైన్‌ వేసుకొని వ్యవసాయం చేస్తున్నరు. రైతు కుటుంబాల్లో సంతోషం కనవడుతోంది. -గంట్ల గంగారెడ్డి, రైతు, దత్తోజీపేట, రామడుగు 

సర్కారుకు రుణపడి ఉంటం..

 మా ఊరు గాయత్రి పంపుహౌస్‌ను ఆనుకొని ఉంటది. మా భూములను పంపుహౌస్‌ నిర్మాణానికి ఇచ్చాం. నాకు ఆరెకరాల భూమి ఉంది. మూడెకరాల్లో సన్నాలు, రెండెకరాల్లో దొడ్డువడ్లతోపాటు ఎకరందాక పత్తి పెట్టినం. ఐదారేండ్ల కింద ఏ పంటేసినా చేతికచ్చేదాక మస్తు భయముండేది. సరైన టైముకు వానలు పడేవి కాదు. ఒక్కోసారైతె పంట చేతికత్తదనంగా చెడగొట్టు వానలతోని పాడైపోయేది. ఇప్పుడు నీళ్లకు కొదవలేదు. మాకు గ్రావిటీ కాలువ పక్కపొంటే ఉన్నా భూగర్భ జలాలు కూడా మస్తున్నయి. మాకు సాయమందిస్తున్న సర్కారుకు రుణపడి ఉంటం. -చింతపంటి రవీందర్‌, రైతు, కిష్టంపల్లి, 


logo