బుధవారం 23 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 11, 2020 , 00:40:43

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాధిగ్రస్తులకు జిల్లా లో మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, చికిత్సకు సంబంధిత అంశాలపై సోమవారం ఆయన పెద్దపల్లి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మన రాష్ట్రంలో అత్యధికంగా రికవరీ రేట్‌ ఉందని, మరణాలు ఒక శాతం లోపు మాత్రమే ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు రోజూ పరిశీలించాలన్నారు. వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించి వారి కి భరోసా కల్పించాలన్నారు. టెస్టు చేయించుకున్న వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు మెడికల్‌ కిట్‌ను అందజేయాలని సూచించారు. కొత్త టెస్టింగ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం తగిన వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన వైద్యు లు, మెడికల్‌ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని సూచించారు. జిల్లా దవాఖానలు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల అనుబంధ దవాఖానల్లో ఉన్న అన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఐసొలేషన్‌ కిట్లు అందజేసి, మం దుల వివరాలకు సంబంధించిన సర్కులర్‌ను  రూపొందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో 40బెడ్లు, సింగరేణి దవాఖానలో 40 బెడ్లు, గోదావరిఖని దవాఖానలో 30 పడకలు, మంథని జేఎన్‌టీయూహెచ్‌ కళాశాలలో 80బెడ్లు కొవిడ్‌ చికిత్సకు సిద్ధం చేశామని అధికారులు మంత్రికి వివరించా రు. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. 

 జాగ్రత్తలు పాటించాలి: ఎంపీ వెంకటేశ్‌నేత

కరోనా కట్టడి కోసం ప్రజలందరూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు వీలైనంత మేర భౌతిక దూ రాన్ని పాటించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి పీహెచ్‌సీలో ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నామని, లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌రావు కోరారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, కలెక్టర్‌ భారతీ హోళికేరి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థల) కుమార్‌దీపక్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ మందల వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo