సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Aug 10, 2020 , 01:37:27

జలాశయాల్లో చేప పిల్లల విడుదల

జలాశయాల్లో చేప పిల్లల విడుదల

ధర్మారం: మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలోని జలాశయాల్లో చేప పిల్లల విడుదల ప్రక్రియ నేటి నుంచి మొదలు కానుంది. సోమవారం ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటనలో భాగంగా గ్రామ శివారులోని బండలవాగు ప్రాజెక్టులో చేప పిల్లలను పోసి కార్య క్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాలోకి వెళ్తే.. జిల్లాలోని 161 మత్స్య సహకార సంఘాలలోని 9,962 మందికి ఉపాధి, ఆర్థిక లబ్ధికోసం ఈ యేడాది జిల్లాలోని ప్రధాన జలాశయాలైన అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్‌తో పాటు 1,076 చెరువులు, కుంటల్లో   కోటి 53లక్షల78 వేల చేప పిల్లలను పోయాలని జిల్లా మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం షానగర్‌, గంగాధర మండలం గట్టుభూత్కూరు మత్స్య విత్తన కేంద్రాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేయనున్నారు. రవ్వు, బొచ్చె, మారిగ, బంగారు తీగ వంటి రకాల చేప పిల్లలు ఈసారి జలాశయాల్లో పోయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోగా పిల్లల పంపిణీ పూర్తికి ఆశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి ఈశ్వర్‌ ద్వారా ధర్మారం మండలం పైడిచింతలపల్లిలోని బండలవాగు ప్రాజెక్టులో సోమవారం లక్షా 37 వేల చేప విత్తనాలు పోసి ప్రక్రియను ప్రారంభిస్తారని, అందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం  వెల్లడించారు. 

పైడిచింతలపల్లిలో పర్యటన

 సోమవారం పైడిచింతలపల్లి గ్రామంలో మంత్రి పర్యటిస్తారని స్థానిక ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నంది మేడారం సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, సర్పంచ్‌ వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ స్వరూప తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భా గంగా గ్రామ శివారులో కంపోస్ట్‌ షెడ్డును నిర్మించారు. గ్రామంలో ఇప్పటికే 2 సీసీరోడ్లు నిర్మించగా వాటిని మంత్రి ఈశ్వర్‌ ప్రారంభిస్తారని, అమాత్యుడి పర్యటనకు గ్రామంలో స్వాగత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్‌ వెంకటమ్మ                    తెలిపారు.  

ఖిలావనపర్తిలో...

 రాష్ట్ర మంత్రి ఈశ్వర్‌ ఖిలావనపర్తి గ్రామంలో పర్యటిస్తారని సర్పంచ్‌ సాగంటి కనకతార, ఎంపీటీసీ మోతె సుజాత, ఉప సర్పంచ్‌ కీసర స్వరూప రాణి, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ పాకాల రాజయ్య తెలిపారు. గ్రామ శివారులో నిర్మించిన వైకుంఠ ధామం, రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభిస్తారని వారు తెలిపారు. 

నేడు మండల పరిషత్‌ భవనం ప్రారంభం

సుల్తానాబాద్‌ : మండల ప్రజా పరిషత్‌ నూతన భవనాన్ని సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఎంపీపీ బాలాజీరావు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం రూ.కోటి 30 లక్షల అంచనాతో మంత్రి ఈటల రాజేందర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో నూతన భవనంలోకి అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎంపీ వెంకటేశ్‌, జడ్పీచైర్మన్‌ పుట్ట మధూకర్‌ హాజరవుతారని తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.