గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Aug 08, 2020 , 01:34:11

రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి

రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి

పెద్దపల్లిజంక్షన్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద జిల్లాలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ బ్యాంకర్లను ఆదేశించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ వినియోగంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి, సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో  జిల్లాస్థా యి సమన్వయ సమావేశాన్ని శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో  7145 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి ఈ యేడు ఫిబ్రవరి 29, నాటికి రూ.288.82 కోట్ల రుణాలున్నాయని, అందులో 20 శాతం రుణాలు రూ. 57.76 కోట్లు షరతులు లేకుండా అందించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి దాకా 3645 సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 41.37 కోట్లు మంజూరు చేశారని వివరించారు. మిగతా రుణాలు కూడా ఈ నెల 13 తేదీ వరకు అందించాలని  బ్యాంకర్లను ఆదేశించారు. అలాగే జిల్లాలో అర్హులైన వారందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, ముద్ర రుణాలు అందించాలన్నారు. జిల్లాలో మత్స్య, పాడి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మూడువేల మంది మత్స్యకారులకు, 15,440 మంది పాడి పరిశ్రమ రైతులకు అర్హత బట్టి రుణాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, ముద్ర రుణాలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కార్పొరేషన్‌ బ్యాంక్‌ వారు వారి పరిధిలోని పరిశ్రమలకు ఇప్పటి దాకా రుణాలు అందించలేదని తెలిపారు. ఆ బ్యాంకుల వారు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. అంతకు ముందు లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రేమ్‌కుమార్‌  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఆర్థిక సహాయం, వాటి సద్వినియోగంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో రామగుండం బల్దియా కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌ ఉన్నారు.