ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 08, 2020 , 00:23:08

జలసవ్వడి... కాళేశ్వరం టూ ఎస్సారార్‌ ఎత్తిపోతలు

జలసవ్వడి... కాళేశ్వరం టూ ఎస్సారార్‌ ఎత్తిపోతలు

కాళేశ్వరం నుంచి శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌ వరకు పంప్‌హౌస్‌లలో మోటర్లు నిరంతరాయంగా నడుస్తుండడంతో జలసవ్వడి కనిపిస్తోంది. శుక్రవారం ఒకేరోజు 36 మోటర్లు నడవడంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతిరోజూ రెండు టీఎంసీల నీటిని తరలించడమే లక్ష్యంగా ఎత్తిపోస్తుండగా గోదావరి ఎగువకు పరవళ్లు తొక్కుతోంది.

కాళేశ్వరం ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీరాజరాజేశ్వర, దిగువమానేరు జలాశయాలను నింపడమే లక్ష్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మోటర్లను నడిపిస్తున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి గాయత్రీ పంపు హౌస్‌ వరకు మొత్తం 41 మోటర్లు ఉండగా.. ఇందులో శుక్రవారం 36 మోటర్లు నడుస్తున్నట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. 

లింక్‌-1లో.. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లో 11 మోటర్లకు 10 మోటార్ల ద్వారా 21,180 క్యూసెక్కులను సరస్వతీ బరాజ్‌లోకి, మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంప్‌హౌస్‌లో 8 మోటర్లలోని 7 మోటర్ల ద్వారా 21,670 క్యూసెక్కులను పార్వతీ బరాజ్‌లోకి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంప్‌హౌస్‌లో 9 మోటర్లకు 8 మోటర్లను ఆన్‌ చేసి 18,270 క్యూసెక్కులను ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లోని ధర్మారం మండలం నంది పంప్‌ హౌస్‌కు 15,750ల క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.

లింక్‌-2లో..

ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటిని ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌ ద్వారా ఆరు మోటర్లతో నంది రిజర్వాయర్‌లో ఎత్తిపోస్తున్నారు. రిజర్వాయర్‌లోని 10 హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లను ఎత్తి నీటిని 7వ ప్యాకేజీ అండర్‌ టన్నెల్‌ ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ ఐదు బాహుబలి మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 13,056 క్యూసెక్కులు ఉండగా, 6.887 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

జలాశయాలు నింపడమే లక్ష్యం

సుమారు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఎస్సారార్‌ జలాశయానికి తరలిస్తున్నట్లు ఈఎన్సీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఇప్పటివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు  నాలుగు టీఎంసీలు రాగా.. ఎస్సారార్‌ జలాశయానికి మూడున్నర టీఎంసీలు తరలించినట్లు తెలిపారు. మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాలు నింపడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరో వారం రోజులపాటు మోటర్లు ఇలాగే నడిచే అవకాశం ఉంది. అంతేకాదు.. పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో మోటర్లు నడిపి వీలైనంత తొందరగా ఎత్తిపోతల ద్వారా రెండు జలాశయాలను నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కంటిన్యూగా 36 మోటర్లు నడువడం కాళేశ్వరం ఎత్తిపోతల చరిత్రలో తొలిసారని అధికారులు తెలిపారు.