గురువారం 24 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 05, 2020 , 01:58:19

ఎలక్ట్రిక్‌ బైక్‌ రయ్‌ రయ్‌..

ఎలక్ట్రిక్‌ బైక్‌ రయ్‌ రయ్‌..

  • l4 గంటల చార్జింగ్‌తో 140 కిలోమీటర్లు ప్రయాణం
  • l4.5 యూనిట్ల విద్యుత్‌ వినియోగం lమార్కెట్లోకి కొత్త వాహనం.. lతక్కువ మెయింటనెన్స్‌.. ఎక్కువ మైలేజీ
  • lతగ్గనున్న వాతావరణ కాలుష్యం 

పెట్రోల్‌తో పని లేదు.. మెయింటెనెన్స్‌ అవసరం లేదు.. మైలేజీ రాదనే బాధ వద్దు.. చార్జి పెడితే చాలు.. రయ్‌..రయ్‌.. మంటూ రోడ్లపై దూసుకెళ్లచ్చు. 4గంటలు చార్జింగ్‌ పెడితే.. అంటే 4.5యూనిట్ల విద్యుత్‌ ఖర్చు చేస్తే ఏకంగా 140 కిలోమీటర్లు తిరిగిరావచ్చు. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు దీటుగా ఆధునికతను సంతరించుకున్న కొత్త ఎలక్ట్రానిక్‌ బైక్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి వాతావరణ కాలుష్య నియంత్రణకు ఎంతో దోహదం చేస్తాయి. - కోరుట్ల

కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన పిడుగు కార్తీక్‌ హైదరాబాద్‌లో ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పెట్రోల్‌తో నడిచే ద్విచక్రవాహనానికి బదులు చార్జ్జింగ్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనాలని అనుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ షోరూంలో మార్చిలో వాహనాన్ని బుక్‌ చేశాడు. ఈ-బైక్‌లకు విపరీతంగా డిమాండ్‌ ఉండడంతో డెలివరీ కోసం కొద్ది రోజులు వేచి చూశాడు. మూడు రోజుల క్రితమే ఈ బైక్‌ రాగా, సోమవారం కోరుట్లలోని ఆర్టీవో కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ కోసం తీసుకువచ్చాడు.  

4గంటలు చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..

వాతావరణ కాలుష్యం తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ-బైక్‌లు మార్కెట్లోకి వస్తుండగా, కొనుగోలుదారులకు రాయితీలు కూడా ఇస్తున్నది. కార్తీక్‌ కొనుగోలు చేసిన రివోల్ట్‌ కంపెనీకి చెందిన ఆర్వీ400 మోడల్‌ ఈ-బైక్‌ ధర 1.57 లక్షలు కాగా, 20 శాతం రాయితీ (32 వేలు) ఇస్తున్నది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇందులో జీపీఎస్‌ అనుసంధానమై ఉంటుంది. దీంతో బైక్‌ ఎక్కడున్నా గుర్తించడానికి వీలుంటుంది. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా బైక్‌ నడవకుండా చేయవచ్చు. ఈ బైక్‌కు 4 గంటలు చార్జింగ్‌ పెడితే 140 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీనికి 4.5 యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుంది. బిల్లు 15 వరకు వస్తుంది. అంటే 15ఖర్చు చేస్తే 140 కిలోమీటర్లు తిరగవచ్చు. వాహనం బ్యాటరీకి ఎనిమిదేళ్ల వారంటీ ఉన్నది. పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు ఉన్న సదుపాయాలన్నీ ఈ వాహనంలో ఉన్నాయి. ఇందులో ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌.. ఇలా స్పీడ్‌ మోడ్‌ సెట్టింగ్స్‌ ఉన్నాయి. ఎకో మోడ్‌ అయితే గంటకు 45 కిలోమీటర్ల వేగం, నార్మల్‌ అయితే 75కి.మీ., స్పోర్ట్స్‌ అయితే 95 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 ఈ-బైక్‌లను విక్రయించగా, హైదరాబాద్‌లో 19, వరంగల్‌లో ఒకటి, కోరుట్లలో ఒక వాహనం రిజిస్ట్రేషన్‌ అయింది. 

ఉమ్మడి జిల్లాలో ఇది మొదటిది..

ఈ-బైక్‌లు కాలుష్య నియంత్రణకు దోహదం చేస్తాయి. రాబోయే కాలంలో విద్యుత్‌, సోలార్‌తో నడిచే వాహనాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 21 బైక్‌లు మాత్రమే విక్రయించారు. హైదరాబాద్‌లో 19, వరంగల్‌లో ఒకటి, జగిత్యాల జిల్లా కోరుట్లలో ఒక వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేశారు. కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొదటిసారిగా ఎలక్ట్రిక్‌ బైక్‌ను కోరుట్లలో రిజిస్ట్రేషన్‌ చేశాం.

- అజ్మీరా శ్యాం నాయక్‌, జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి logo