ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 05, 2020 , 01:58:19

ఆదర్శం ఆ అన్నదమ్ములు

ఆదర్శం ఆ అన్నదమ్ములు

  • lముగ్గురూ పట్టభద్రులే
  • lనాలుగేళ్లు వివిధ జాతుల కోళ్లు..    కుందేళ్ల పెంపకం
  • lనెలకు రూ.20వేలకుపైగా ఆదాయం
  • lస్వయంగా గుడ్లు పొదిగే  యంత్రం ఆవిష్కరణ 
  • lఅనేక పురస్కారాలు.. ప్రశంసలు 
  • lఆదర్శంగా నిలుస్తున్న బ్రదర్స్‌

ఊరిపై మమకారం.. బాల్యం నుంచే పక్షుల పెంపకంపై ఉన్న ఇష్టం.. ఆ ముగ్గురు అన్నదమ్ములను సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ స్టార్స్‌గా నిలిపింది. ఒకరు డిగ్రీ.. మరొకరు ఎంకాం, ఇంకొకరు బీటెక్‌ పూర్తిచేసినప్పటికీ సొంతంగా ఏదైనా చేయాలనే సంకల్పం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మేటి ఆవిష్కర్తలుగా నిలిపింది. వివిధ రకాల కోళ్లు.. కుందేళ్ల పెంపకంలో సక్సెస్‌ను తెచ్చిపెట్టడడమే కాదు ఇంక్యుబేటర్‌ తయారీతో ది బెస్ట్‌ ఇన్నోవేటర్స్‌ అనే అవార్డునూ కట్టబెట్టింది. వారే అంతర్గాం మండలం రాయదండికి చెందిన పల్లె సతీశ్‌, రాజు, శ్యాం. స్వయం కృషిని నమ్ముకొని స్వయం ఉపాధిలో రాణిస్తున్న సోదరులపై నమస్తే ప్రత్యేక కథనం. -అంతర్గాం(జ్యోతినగర్‌) 

అంతర్గాం(జ్యోతినగర్‌): పల్లె బ్రదర్స్‌. రామగుండం ప్రాంతంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు ఇవి. అంతర్గాం మండలం రాయదండికి చెందిన పల్లె శంకరయ్య- లక్ష్మి దంపతుల కొడుకులే ఈ ము గ్గురు సోదరులు. పెద్ద కొడుకు సతీశ్‌ గ్రా డ్యుయేట్‌, రెండోవాడు పల్లె రాజు ఎంకాం (ఓయూ), మూడో కుమారుడు శ్యాం సుందర్‌ బీటెక్‌ పూర్తి చేశారు. వీరికి కన్న ఊరు.. పక్షులు.. జంతువులన్నా బాల్యం నుంచే చాలా మక్కువ. ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాల వైపు వెళ్లకుండా స్వయం కృషితో రాణించాలని.. కోళ్ల పెం పకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే అందరిలా కాకుండా ఎలాంటి మందులు.. సూదుల వినియోగం లేకుండా ఆర్గానిక్‌ పద్ధతిలో పెంచాలని భావించారు. అవగాహన కోసం తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారాలను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ క్రమంలో 2017లో తమ ఇంటి ఆవరణలో అగ్రీ గ్రీన్‌ ఫామ్‌ ఏర్పాటు చేసుకున్నారు. 

కుందేలు, పావురాల పెంపకం 

కోళ్లు, పావురాలతో పాటు ఐదు రకాల కుందేళ్లను పెంచుతున్నారు. ఇందులో రష్యన్‌ జాయింట్‌, బ్లాక్‌ జాయింట్‌, సోవియెట్‌ ఆర్జినా, కాలిఫోర్నియా వైట్‌, న్యూజిలాండ్‌ వైట్‌ రకాలకు చెందినవి ఉన్నాయి.  అరుదైన జాతి కావడంతో ఒక్కోదాన్ని 5-6 నెలల వయస్సులో రూ.1500-2000 దాకా విక్రయిస్తున్నారు. అమెరికన్‌ ప్యాన్‌టెల్‌ రకం పావురాలు కూడా పెంచుతున్నారు. వీటికి తలపై జుట్టు, కాలి గోర్ల వద్ద ఈకలతోపాటు నెమలి పింఛం మాదిరి తోక ఉంటుంది.

 లాభాలే లాభాలు..

 తెల్లజాతి సీమ కోడికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంటుంది.  ధర రూ.2వేలు పలుకుతుంది. జీవితకాలం దాదాపు పదేళ్లు. ఇది ఆరు నెలల వయస్సులో 1.8-2.6 కిలోల బరువు పెరుగుతుం ది. అదే సమయంలో గుడ్ల దశకు చేరుతుంది. ఏడాదిలో దాదా పు 40-60 గుడ్లు పెడతాయి. ధర రూ.40. మూడు రోజుల వయస్సున్న పిల్లలను రూ. 90కి, 30 రోజుల వయస్సు వచ్చాక జత పిల్లలకు రూ. 500-600 చొప్పున విక్రయిస్తున్నారు. 

కడక్‌నాథ్‌ కోడి మంచి రేటే పలుకుతుంది. కోడి ధర రూ.వెయ్యి దాకా ఉన్నది. జీవిత కాలం ఏడేళ్లు.   ఐదునెలలకే 1.5 నుంచి 2కిలోల బరువు పెరుగుతుంది. అప్పుడే గుడ్లు పెట్టడడం మొదలవుతుంది. ఇది ఏడాదికి 100-120 వరకు గుడ్లు పెడుతుంది. ఒక్కో ఎగ్‌ ధర రూ. 50 -70 ఉంటుంది. మూడు రోజుల పిల్లల్ని రూ.110,  నెల రోజుల వయస్సున పిల్లల్ని రూ.200కు విక్రయిస్తున్నట్లు సోదరులు తెలిపారు. 

కౌజు పిట్టలు మూడు నెలలకు 170-220 గ్రాముల బరువు పెరుగుతాయి. గుడ్ల దశకు చేరుతుంది. గుడ్డు ధర రూ.5. దీని జీవిత కాలం ఐదేళ్లు. ఒక్కోపిట్టను రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే మూడు రోజుల కౌజు పిట్ట పిల్లలను రూ.10కి ఒకటి అమ్ముతున్నారు. 

దేశీవాళి నాటుకోడి. దీని జీవితకాలం 8-9 ఏళ్లు. ఐదున్నర నెలలకు 1.5- 2.5 కిలోల బరువు పెరిగి, గుడ్లు పెట్టే దశకు చేరుతుంది. ఏడాదికి 4-5 విడుతలుగా 70-90 గుడ్లు పెడతాయి. మార్కెట్‌లో కిలో కోడిధర రూ.350-400 పలుకుతుంది. గుడ్డు రూ. 13-15. మూడు రోజుల పిల్ల ధర రూ.65కు.. నెలరోజు పిల్ల ధర రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. 

 ఫాం నుంచే విక్రయాలు

 కోళ్ల పెంపకం.. ఉత్పత్తిలో రాణిస్తున్న పల్లె బ్రదర్స్‌ కోళ్లు.. గుడ్లను ఫాంనుంచే విక్రయిస్తున్నారు. నాణ్యమైన కోళ్లకు బ్రాండ్‌గా నిలువడంతో వినియోగదారులే ఫాంకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. కోళ్లతోపాటు స్థానిక రైతులకు స్వయం ఉపాధి కింద పిల్లలను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తాము పెంచే కోళ్లు ఆర్గానిక్‌ కావడంతో స్థానికంగా చాలా డిమాండ్‌ ఉందని.. ఫలితంగా మార్కెటింగ్‌ చేసే పని తప్పిందని పల్లె బ్రదర్స్‌ చెబుతున్నారు. ఎక్కువగా పండుగలు, శుభకార్యాలు, జాతర సీజన్‌ల్లో భారీగా వ్యాపారం జరుగుతుందని.. అన్నింటి మీదా కలిపి నెలకు రూ.20వేల పైగా ఆదాయం వస్తున్నదని సోదరులు చెబుతున్నారు. 

 వివిధ రకాల కోళ్ల పెంపకం.. 

కోళ్ల పెంపకంలో తగు జాగ్రత్తలను పాటిస్తే గణనీయమైన లాభాలు పొందవచ్చని వివరిస్తున్నారు. అరుదైన తెల్లజాతి చీమకోళ్లు, నాటు కోళ్లు, కడక్‌నాథ్‌, జపనీస్‌ కౌజు పిట్టలు పెంచుతున్నారు. నాలుగేళ్ల కింద పది పెట్టలు.. రెండు పుంజులతో మొదలైన వ్యాపారం ఇప్పుడు వందలు.. వేలకు చేరింది. వివిధ జాతుల కోళ్లతో వారి ఫాం మినీ కోళ్ల ఫారానే తలపిస్తున్న ది. ఫాం ప్రారంభంలో  తెల్లజాతి సీమ కోడి పి ల్లలను తమిళనాడు నుంచి, మధ్యప్రదేశ్‌ నుంచి కడక్‌నాథ్‌ కోడిపిల్లలు, ఖమ్మం నుంచి కౌజు పిట్టలను, కొన్ని పిల్లలను కొ నుగోలు చేశారు. అయితే గుడ్లను పొదిగేసి పిల్లలు ఉత్పత్తి చేస్తుండడం వల్ల ప్రస్తుతం కొనే పనేలేకుండా పో యింది. ప్రస్తుతం ఫాంలో ఒక్కో రకం కోళ్లు, కౌజు పిట్టలు దాదాపు 500కు పైనే ఉన్నాయి. 

మరికొంత మందికి ఉపాధి

 పల్లె బ్రదర్స్‌ కోళ్ల పెంపకానికే కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. తమ తెలివితేటలతో ఒక్క  మందు.. సూది లేకుండా కోళ్లను పెంచుతూ.. రెండు చేతులా సంపాదించడమే కాదు ఆసక్తిగల యువతకు దారి చూపుతున్నారు. కోళ్ల పెంపకంపై చుట్టు పక్కల గ్రామాల రైతులు.. మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటికీ 550 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. స్వయం ఉపాధి కింద పెట్టుకునేందుకు 300మంది మహిళలకు మెళకువలు నేర్పారు.

పల్లె బ్రదర్స్‌కు అరుదైన గౌరవం

కోళ్ల పెంపకంలో రాణించడమే కాదు సొంతంగా ఇంక్యుబేటర్‌ను ఆవిష్కరించిన ఈ అన్నదమ్ములకు అరుదైన గౌరవం దక్కింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన మేక్‌ ఈవెంట్‌ ఆల్‌ ఇండియా బిగ్గెస్ట్‌ మేకర్‌ ఫెయిర్‌-2019కు పల్లె బ్రదర్స్‌కు రూపొందించిన ఇంక్యుబేటర్‌ ప్రదర్శనకు ఎంపికకావడం విశేషం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున గతేడాది ఆగస్టు 15న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని పొందారు. అగ్రి గ్రీన్‌ ఫామ్‌ను ఎమ్మెల్యే, జడ్పీ సీఈవో, జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు సందర్శించి అభినందించారు. logo