బుధవారం 30 సెప్టెంబర్ 2020
Peddapalli - Aug 05, 2020 , 01:58:32

మానవత్వం చాటిన పుట్ట మధూకర్‌

మానవత్వం చాటిన  పుట్ట మధూకర్‌

  • lకరోనాతో యువకుడి మృతి  
  • lఅన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన జడ్పీ చైర్మన్‌  

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ మంథని టౌన్‌: యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కరాళ నృత్యం చేస్తున్న కరోనా బారిన పడి మృతి చెందితే సొంత బంధువులే దగ్గరికి రాని ఈ పరిస్థితుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్టమధూకర్‌ చలించిపోయారు. ఓ యువకుడు కరోనా వైరస్‌తో మృతి చెందగా ఆయన అన్నీ తానై అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు. మంథనిలోని సత్యసాయినగర్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో శ్వాస కోస సమస్యలతో మృతి చెందాడు. అంతిమ సంస్కారాలను జరిపించేందుకు మృతదేహాన్ని రాత్రి మంథనికి తరలించగా కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న మధూకర్‌ బంధువులతో మాట్లాడి మృతదేహాన్ని మంథని గోదావరి తీరంలోని శ్మశాన వాటికు తరలించి అక్కడ దహన సంస్కారాలను జరిపించారు. ఇద్దరు, ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి మృతదేహాన్ని దహనం చేయించారు. అదే విధంగా మంగళవారం ఉదయం బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఇటీవల రామగిరి మండలంలో ఒక ప్రజా ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ రాగా వారి ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.


logo