ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 03, 2020 , 01:34:55

వానకాలం వరినాట్లలో జాగ్రత్తలు

వానకాలం వరినాట్లలో జాగ్రత్తలు

కాల్వశ్రీరాంపూర్‌ : వానకాలం వరి నాట్లు వేసే సమయంలో రైతు లు జాగ్రత్తలు తీసుకోవాలి. వరి నారు పోసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే దాకా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించే అవకాశముంది.  వరి నాటు వేసే సమయంలో ఎలాం టి పద్ధతులు పాటించాలో, నారు పొలానికి ఎలాంటి జాగ్రత్తలతో తీసుకెళ్లాలనే విషయాన్ని కాల్వశ్రీరాంపూర్‌ మండల వ్యవసాయ అధికారి నాగార్జున వివరించారు.   

పొలాన్ని కలియదున్నాలి

వరి నాట్లు వేసే పొలాన్ని దాదాపు మూడు వారాల ముందు నుం చి తయారు చేయాలి. ట్రాక్టర్‌ లేదా ఎడ్ల నాగలితో ఒక సాలు దున్నిన తరువాత మరో నాలుగైదు రోజులకు మరో సాలు చేయాలి. దీంతో కలుపు మొక్కలు బురదలో కూరుకుపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. అదే హడావిడిగా పొలాన్ని సిద్ధం చేసినట్లయితే కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో కలుపు మొ క్కలు సైతం వరితో సమానంగా పెరిగి పంటను దెబ్బతీస్తాయి. 

పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ వేస్తే వాటిని కలియదున్నే సమయంలో 50 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వేసినట్లయితే పచ్చిరొట్ట ఎరువులు త్వరగా చివికి మొక్కలకు భాస్వరం ఎరువును అందిస్తాయి. 

సమానంగా జంబు కొట్టాలి

ప్రధాన పొలాన్ని దున్నిన తర్వాత చదును చేసేందుకు జంబు కొట్టాలి. జంబు బాగా కొడితే నీటి వృథాను అరికట్టడంతో పాటు కలుపుకూడా అదుపులో ఉంటుంది. సాగునీరు పెట్టినప్పుడు పొలమంతటికి అందే అవకాశముంది. చివరి దమ్ములో ఆయా ప్రాంతాలకు సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను మొదటి దపాగా వేసుకోవాలి. కాంప్లెక్స్‌ ఎరువులను వాడదలుచుకుంటే రైతు సోదరులు దుక్కిలోనే వేసుకోవడం మంచిది. వరిలో పైపాటుగా వేసిన కాంప్లెక్స్‌ ఎరువులను మొక్కలు సమర్ధవంతంగా వినియోగించుకోలేవు. దమ్ములో జింక్‌, భాస్వరం ఎరువులను ఒకేసారి వేయకుండా రెండు మూడు రోజుల తేడాతో వేసుకోవాలి. పొలం గట్లపై కలుపు మొక్కలను, గడ్డిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. 

నాట్లు వేసేటప్పుడు..

నాట్లు వేయాలంటే నారు ఆరోగ్యంగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగిన నారు ప్రధాన పొలంలో నాటు వేసేందుకు అనుకూలం. పొలాన్ని బురద బురదగా తయారు చేసి అందులో పైపైన 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతున నాట్లు వేయడం మంచిది. వరి నారును లోతుగా నాటు వేస్తే పిలకలు రావడం ఆలస్యమవుతుంది. పిలకల సంఖ్య కూడా తగ్గిపోతుంది. నాటిన మొక్క లేచి చనిపోకపోతే కుదురున ఒకటి లేదా రెండు మొక్కలు నాటినా, గింజ దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదు. కుదురుకు రెండు నుంచి మూడు నారు మొక్కలు నాటవచ్చును. నాటే సమయంలో నారు తలలు తుంచి నాటుకోవడం మంచిది. ఎందుకంటే పొడవాటి నారు మొక్కల చివరి ఆకులు పొలంలో వాలి పోయి బురదకు అంటుకు పోవడంతో ఆకులకు ఆశించే తెగుళ్లు వేగంగా వృద్ధి చెందుతాయి. ఆకులను కత్తిరించుకోకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన నారును సరైన వయసులో నాటుకోవడం మంచిది. నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటుకోవాల్సి వస్తే కుదుళ్ల సంఖ్య పెంచుకోవాలి.   మొక్కలు సమాన దూరంలో ఉంటేనే అన్ని రకాల లాభదాయకం. దీనికి తోడు నత్రజని మూడు దపాలకు బదులుగా రెండు సార్లు వేసుకోవాలి. మొదటి దపాలో 70 శాతం, చివరి దమ్ములో 30శాతం నత్రజనిని అంకురార్పణ జరిగే దశలో వేసుకోవాలి. దీంతో పిలకలు త్వరగా వచ్చి నాట్లు ఆలస్యమైన దిగుబడిపై ప్రభావం చూపదు. కానీ సాధ్యమైనంత వరకు లేత నారును నాటుకోవడం మంచిది.

20 రోజుల వరకు స్వల్పంగా నీరు

నాట్లు పూర్తయిన తరువాత పొలంలో 20 రోజుల వరకు స్వల్పంగా అంటే 5 సెంటీమీటర్ల దాకా నీరు ఉండాలి. సక్రమ నీటి యాజమాన్యం పాటిస్తే సకాలంలో పిలకలు వచ్చి దిగుబడి బాగుంటుంది. సాగు నీరు స్వల్పంగా ఉంటే సుడి దోమ, లద్దె పురుగు తాకిడి ఎక్కువగా ఉండదు. నాట్లు వేసిన పొలంలో ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. తడి ఆరిపోతే కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. రసాయన ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీరు స్వల్పం గా ఉండేలా చూసుకోవాలి. నాటిన వారం పది రోజులకు పిలకలు పెరగడం ప్రారంభమై, నాటిన 50 నుంచి 60 రోజులకు వరి గరిష్ట పిలకల స్థాయికి చేరుకుంటుంది. ఈ పద్ధతులు పాటిస్తే రైతులు అధిక దిగుబడి సాధించే అవకాశముందని ఏవో నాగార్జున తెలిపారు.