ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 01, 2020 , 02:05:52

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

  • నేడు ఈద్‌-ఉల్‌-జుహా
  • కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు

ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు అతి ముఖ్యమైన పండుగల్లో ద్వితీయ ప్రాధాన్యత కలిగినది ‘ఈద్‌-ఉల్‌-జుహా’(బక్రీద్‌). బక్రీద్‌ అంటే ‘బకర్‌ ఈద్‌'. ఈద్‌ అంటే పండుగ, బకర్‌ అంటే జంతువు. జంతువును బలి ఇచ్చే పండుగ కనుక ఈ పండుగను బక్రీద్‌ లేదా ఈద్‌-ఉల్‌-ఖుర్బానీ’ అని కూడా పిలుస్తారు. ఖుర్బానీ అంటే దేవుడి పేరిట పేదవారికి జంతు మాసం దానమివ్వడం. ఇస్లాంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సుమారు నాలుగు వేల ఏళ్ల క్రితం ముస్లిం యుగ పురుషుడు ఖలీల్‌-ఉల్లాహ్‌ (దేవుడి స్నేహితుడు) హజ్రత్‌ ఇబ్రహీం అలైహి సలాం దైవ ప్రసంశ పొందాడు. కట్టుకున్న ఇల్లాలిని, కన్న కొడుకును సైతం దైవ విశ్వాసం కోసం త్యాగం చేయాలనుకున్న హజ్రత్‌ ఇబ్రహీం భక్తి తత్పరతను విశ్వవ్యాప్తంగా ముస్లింలు ఈ రోజు స్మరించుకుంటారు. ఇబ్రహీం చేసిన అసమాన త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ప్రతి ఏటా బక్రీద్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. 

ధర్మ సంస్థాపన కోసం..

తరతరాల దురాచారాలను వ్యతిరేకించి, అంధ విశ్వాసాలను తుడిచి పెట్టాలనుకున్న   ఇబ్రహీం అభ్యుదయ భావజాలం సాంప్రదాయవాదుల ఆగ్రహానికి కారణమైంది.  ఈ క్రమంలో తన జాతికి, కన్న తండ్రికి దూరమయ్యాడు. చివరికి చక్రవర్తి ఆగ్రహానికి సైతం గురై వెలివేయబడ్డాడు. ధర్మ సంస్థాపన కోసం ఇల్లు వాకిలీ వదిలి పరదేశాలకు పయనమయ్యాడు. దేవుడి అనుగ్రహం కోసం అనేక బాధలు అనుభవించాడు. సమస మాజ స్థాపనే లక్ష్యంగా అనేక దేశాల్లో పర్యటించి అక్కడివారిని చైతన్యపరిచారు.