శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jul 31, 2020 , 01:36:25

‘బయోకాస్టిక్‌'తో అడవిపందులకు చెక్‌

‘బయోకాస్టిక్‌'తో అడవిపందులకు చెక్‌

సైదాపూర్‌: అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడేందుకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు బయోకాస్టిక్‌ మిషన్‌ను రూపొందించారు. ఈ యంత్రం పనితీరును పరిశీలించేందుకు మండలంలోని రాయికల్‌ తండాలోని రైతు భూక్య రంగయ్య పొలంలో అమర్చారు. కాగా, ఈ పరికరం పనితీరు పరిశీలించేందుకు ఆత్మ ప్రధాన సంచాలకులు ప్రియదర్శిని రాయికల్‌ తండాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మిషన్‌ పనితీరును వివరించారు. సూర్యరశ్మితో పనిచేసే ఈ యంత్రం ప్రతి ఐదు సెకండ్లకు వివిధ రకాల శబ్ధాలను చేస్తుందన్నారు. ఈ ధ్వనులు 10 నుంచి 15 ఎకరాల వరకు వినిపించడంతో అడవిపందులు బెదిరి పంటల వద్దకు రావన్నారు. అడవిపందులతో ఇబ్బంది పడుతున్న రైతులు తమ చేన్లల్లో అమర్చుకోవాలని సూచించారు. ఈ యంత్రం విలువ రూ. 25360 ఉంటుందని, ఆత్మ ద్వారా 95 శాతం సబ్సిడీపై లభిస్తుందని చెప్పారు. రైతు రంగయ్య మాట్లాడుతూ ఈ పరికరం వల్ల అడవి పందులు తన పొలం లోకి రావడం లేదని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్మ బీటీఎం సత్యనారాయణ, ఏటీఎం స్రవంతి ఉన్నారు.