గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jul 30, 2020 , 02:11:22

సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

  •  మేయర్‌ వై సునీల్‌రావు
  •  13వ డివిజన్‌లో సీసీ రోడ్డు  నిర్మాణ పనులు ప్రారంభం 

కార్పొరేషన్‌: కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని 13వ డివిజన్‌లో రూ. 73 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ. 347 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటితో 450 పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కరోనాతో అభివృద్ధి పనులకు అంతరాయం కలిగిందన్నారు. శివారు డివిజన్లలో  నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. శివారు కాలనీల్లో చేపట్టే అభివృద్ధి పనులపై కార్పొరేటర్ల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, విడుతల వారీగా చేపడుతామని తెలిపారు. అన్ని డివిజన్లలో రోజూ తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో  పార్కుల అభివృద్ధి, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మానేరు డ్యాం కట్ట కింద ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు రూ. 150 కోట్లతో మంత్రి గంగుల కమలాకర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయించారన్నారు. డ్యాం కట్ట వెంట 5 కిలో మీటర్ల మేరకు వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సదుపాయాలు కల్పించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ, నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు. 

హరితహారంలో భాగస్వాములవ్వాలి

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్‌ వై సునీల్‌రావు నగర ప్రజలకు పిలుపు నిచ్చారు. నగరంలోని 14, 36వ డివిజన్లలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటడంతో పాటు కాలనీవాసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తే కరీంనగర్‌ను  హరిత నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజలకు ఇష్టమైన పండ్లు, పూల మొక్కలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. మొక్కలను చిన్న పిల్లల్లా చూసుకోవాలని, ప్రతి రోజూ సమయం కేటాయించి నీళ్లు పోయాలన్నారు. ఇంటి ఆవరణలో స్థలం లేని వారి కుండీల్లో మొక్కలు నాటాలన్నారు. మనం పెంచే చెట్లు భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యతగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, గుగ్గిళ్ల జయశ్రీ, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.