బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jul 28, 2020 , 02:27:43

స్వచ్ఛంద లాక్‌డౌన్‌లో మేము సైతం..

స్వచ్ఛంద లాక్‌డౌన్‌లో మేము సైతం..

  • ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సూచనలతో అప్రమత్తం చేస్తున్న కార్పొరేటర్లు

గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాం తంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థల బాటలో మేముసైతం.. అంటూ పలు డివిజన్ల ప్రజలు కూడా ముందుకు వచ్చారు. వారం రోజుల నుంచి రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుతుండడంతో ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించుకున్న వ్యాపార సంస్థలు తిరిగి ఆ గడువును మరికొంత కాలం పాటు పొడిగించాయి. గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో వినియోగదారుల సౌకర్యార్థం ఒంటి గంట దాకా మాత్రమే దుకాణాలు తెరిచి ఆ తర్వాత స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. 

ప్రజల సంక్షేమం కోసం..

ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సూచనలతో పలు డివిజన్లకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సైతం ఆయా డివిజన్ల ప్రజల క్షేమం కోసం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొడ్డు రజిత రవీందర్‌ ముందుకు వచ్చి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆ డివిజన్‌ పరిధిలోని ఫైవింక్లయిన్‌, విఠల్‌నగర్‌ తదితర కాలనీల ప్రజలను సమీకరించి సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఒప్పించారు. సోమవారం నుంచి డివిజన్‌లో ప్రజలంతా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇండ్లకే పరిమితమయ్యారు. నగరంలో రోజు రోజుకూ కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దరిమిలా ఆ కార్పొరేటర్‌ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అత్యవసరమైతే తప్ప అది కూడా ముఖానికి పూర్తిగా మాస్కు ధరించి వస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. కార్పొరేటర్‌ సూచనల మేరకు ఆ డివిజన్‌ ప్రజలు ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. డివిజన్‌ ప్రజల సౌకర్యార్థం దుకాణాదారులు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేసుకున్నారు.