గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jul 28, 2020 , 02:28:04

పచ్చని లోగిలి

పచ్చని లోగిలి

  • హరిత ప్రేమికుడు పంచాయతీ కార్యదర్శి 
  • ఇంటి చుట్టూ మొక్కల పెంపకం 
  • తీరొక్క చెట్లతో ఇల్లే ఓ నందనవనం 

వృత్తిని గౌరవించేవారు కొందరు.. ప్రేమించేవారు ఇంకొందరు.. రెండో కోవకి చెందిన వారు అక్కపల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి మల్యాల బుగ్గరాములు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం స్ఫూర్తితో తన ఇంటి నిండా మొక్కలు నాటి నందనవనంలా తీర్చిదిద్దుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రతిఒక్కరిలో హరిత చైతన్యాన్ని రగిలిస్తున్నారు. మొక్కవోని దీక్షతో ముందుకుసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన బుగ్గ రాములు   2017లో కానిస్టేబుల్‌గా ఎంపికై హైద్రాబాద్‌లోని యూసఫ్‌గూడలో విధులు నిర్వర్తించాడు. మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాడు. మద్దిమల్ల లొద్దితండా పంచాయతీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ముగ్ధుడైన బుగ్గ రాములు వృత్తి బాధ్యతల్లో భాగంగా తండావాసులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాడు. చెప్పడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపాడు. ఇంటి ఆవరణలో విరివిగా మొక్కలు పెంచాడు. అంతేకాకుండా మేకలు, కోళ్లను సాదుతున్నాడు. నాటిన మొక్కలను కంటికిరెప్పలా కాపాడడంతో ఆ గృహం ఆహ్లాదకరంగా తయారైంది.

ఎటు చూసినా చెట్లే..

ఆహ్లాదం, ఆరోగ్యంకోసం రకరకాల గాలిని ఇచ్చే, గాలిని ఫిల్టర్‌చేసే మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచాడు. అందులో గాలికోసం గుల్‌మోహర్‌, పచ్చతురాయి, టెకొమో, హైబ్రిడ్‌ తంగేడు. గన్నేరు మొక్కలను ఆవరణలో నాటాడు. ప్రహరీ చుట్టూ అందం, ఆహ్లాదం కల్గించే మొక్కలను కుండీల్లో పెంచాడు. విరగబూసిన పూలతో ఆవరణ మొత్తం కనువిందు చేస్తున్నది. అందులో పారిజాతం, నాలుగురకాల మల్లెచెట్లు, గులాబీ, లిల్లీపూలు, గడ్డిపూలు పెంచడంతోపాటు ఆహారం కోసం కరవేపాకు, కూరగాయల మొక్కలు, అరటిచెట్లు నాటి కాపాడాడు.   

హరితహారం అంటే నాకు ఇష్టం..

ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో హరితహారం అంటే నాకు అమితమైన ఇష్టం.   సాగు చేసుకునేందుకు భూమి లేకపోవడంతో ఇంటి ఆవరణలోనే పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను పెంచుతున్నా. గతంలో కానిస్టేబుల్‌గా ఎంపికైనా విధి నిర్వహణలో సంతృప్తి కనిపించలేదు. కానీ, వేతనం తక్కువైనా నాకు నచ్చిన ఉద్యోగం కావడంతో కార్యదర్శి ఉద్యోగాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తున్నా. నేను పనిచేస్తున్న వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండా వాసులకు మొక్కల పెంపకంపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నా. ఇప్పటివరకు 40 వేల మొక్కలు నాటించి వందశాతం బతికేలా చర్యలు తీసుకున్నా. - మల్యాల బుగ్గరాములు