ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jul 27, 2020 , 03:29:11

కాడెడ్లకు తగ్గని ఆదరణ

కాడెడ్లకు తగ్గని ఆదరణ

ఓదెల: వ్యవసాయ పనుల్లో భాగంగా దుక్కి దున్నడం మొదలు.. పంట ఇంటికి వచ్చే దాకా ప్రతి దశలో యంత్రాల వినియోగం పెరుగుతున్నది. సాగులో ఆధునిక పద్ధతులు, నయా విధానాలు వచ్చినా కాడెడ్లకు ఆదరణ తగ్గడంలేదు. ప్రతి సీజన్‌లో వాటి యజమానులకు ఉపాధి దొరుకుతున్నది. రైతుల పనులు సకాలంలో పూర్తవుతున్నాయి.

కాలానికి అనుగుణంగా..

గతంలో ప్రతి ఇంట్లో దాదాపుగా కాడెడ్లు, ఎడ్లబండ్లు దర్శనమిచ్చేవి. మారిన పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఎక్కువగా యంత్రాలతో వ్యవసాయ సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్లెల్లో ఎడ్లు ఉన్న రైతులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. రైతుల ఇండ్ల ఎదుట ఎక్కువగా ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. రైతులు కాలానుగుణంగా దిగుబడి పెంచుకోవడం, శ్రమ తగ్గించుకోవడం, సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం ట్రాక్టర్ల వినియోగం పెంచుకుంటున్నారు. పలువురు ఎడ్లకు మేత, వాటి ఆలనాపాలన చూసుకోవడం కష్టంగా భావిస్తున్నారు. దీంతో ఎడ్లను అమ్ముకొని ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. 

ఇలాంటి సమయంలో..

పత్తి చేలలో మొక్కల మధ్య దౌర కొట్టాలంటే కాడెడ్ల అవసరం నెలకొంది. ట్రాక్టర్ల ద్వారా మొక్కల మధ్య దౌర కొట్టడం వీలుకాదు. ట్రాక్టర్‌తో తిప్పితే మొక్కలు విరిగిపోవడం, టైర్ల కింద పడి ధ్వంసం కావడం జరుగుతుంది. వానకాలంలో చేన్లు బురదమయంగా ఉంటాయి. ఆ సమయంలో ట్రాక్టర్లతో పని చేయాలంటే ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో కాడెడ్లతోనే దౌర కొట్టాల్సి ఉంటుంది. అలాగే నారుమడి సిద్ధం చేయాలన్నా, నాట్లు వేసే సందర్భం లో జంబు కొట్టాలన్నా ఎడ్లే అవసరమవుతున్నా యి. ఈ కారణంగా కాడెడ్లు ఉన్న వారికి గ్రామా ల్లో భలే గిరాకీ నెలకొంది. వారికి ఒక రోజూ కూలి ప్రస్తుతం దాదాపు రూ. 2వేల దాకా పలుకుతున్నది. మండలంలో కాడెడ్లు ఉన్న వారు ఒక సీజన్‌లో దాదాపుగా రూ. 40-50 వేల వరకు సంపాదిస్తున్నారు.