సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jul 27, 2020 , 03:23:50

ఎన్టీపీసీ దుకాణాల పని వేళల్లో మార్పు

ఎన్టీపీసీ దుకాణాల పని వేళల్లో మార్పు

జ్యోతినగర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఎన్టీపీసీ పట్టణంలోని వర్తక వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని వేళలను కుదించుకున్నారు. పట్టణంలోని అగ్రసేన్‌ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆరోగ్య క్షేమంతో పాటు వారికి నిత్యావసరాల అమ్మకాల దృష్ట్యా దుకాణాల పని వేళలను మార్చుతున్నట్లు తీర్మానం చేసుకున్నారు. పట్టణంలోని ప్రతి దుకాణాదారుడు ఉదయం 6 గంటలకు తెరిచి మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయాలన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం సాయంత్రం 5గంటలకు బంద్‌ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 31వ తేదీ దాకా ఈ తీర్మానం అమలులో ఉంటుందని వారు ప్రకటించారు. తదనంతర పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయ ర్‌ అభిషేక్‌రావు ముఖ్యఅతిథిగా  హాజరై మాట్లాడారు. వ్యాపార సంస్థలు ముందుకు వచ్చి స్వ చ్ఛందంగా పని వేళలను మార్పు చేసుకోవడంపై అభినందించారు. ఎన్టీపీసీ పట్టణంలో కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తుల కోసం స్థానికంగా ఐసొలేషన్‌ వార్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఎన్టీపీసీ పట్టణ వర్తక వ్యాపార వాణిజ్య సంఘం అధ్యక్షుడు మెట్టుపల్లి అనిల్‌రావు, వ్యాపారులు వేణు మలానీ, మనోజ్‌ అగర్వాల్‌, ముఖేష్‌ అగర్వాల్‌, అరుణ్‌ మన్యార్‌, అంజయ్య, నల్ల వేణు, భరత్‌గౌడ్‌, చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. 

బులియన్‌ మర్చంట్‌ వ్యాపారులు..

కోల్‌సిటీ: గోదావరిఖని నగరంలోని బులియన్‌ మర్చంట్‌ వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లక్ష్మీనగర్‌లోని బులియన్‌ మర్చంట్‌ ఏరియాలో ఆదివారం వ్యాపారులు సమావేశమయ్యారు. ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ గణముక్కుల మహాలక్ష్మీ తిరుపతి హాజరై మాట్లాడారు.  బులియన్‌ మర్చంట్‌ వ్యాపారులు విధించుకున్న స్వచ్ఛంద లాక్‌డౌన్‌ 27వ తేదీతో ముగియనుందని, ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆగస్టు 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రవీంద్రాచారి, పల్లెర్ల శ్రీనివాస్‌, గంప కిషన్‌, శ్రీధర్‌, జాదవ్‌ ఉన్నారు.

కూరగాయల మార్కెట్‌లో బంద్‌

కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తున్న కారణంగా సోమవారం నుంచి తాము కూడా స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నట్లు హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు ఎంఏ గౌస్‌ తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని నగరంలోని ప్ర ధాన కూరగాయల మార్కెట్‌లో ఆదివారం హమాలీ వర్కర్లు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హమాలీలు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కూరగాయల మార్కెట్‌కు రోజూ వచ్చే లారీల నుంచి దిగుమతి, ఎగుమతిని  ఈ నెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ దాకా లాక్‌డౌన్‌ పాటిస్తున్నామని తెలిపారు. మార్కెట్‌ హోల్‌సేల్‌ వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే అసంఘటిత సంక్షేమ నిధిని హమాలీ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు.  మార్కెట్‌కు వచ్చే లారీలకు శానిటైజ్‌ చేయించిన తర్వాతే సరుకులను దిగుమతి చేయించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌, రాంచందర్‌, రవి, జానిమియా, రంగు రమేశ్‌, ఐలయ్య, గాలిపల్లి సతీశ్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు.