మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Jul 22, 2020 , 02:23:46

సింగరేణిలో క్వారంటైన్‌ కేంద్రాలు

సింగరేణిలో క్వారంటైన్‌ కేంద్రాలు

గోదావరిఖని: సింగరేణి వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ అప్రమత్తమైంది. సింగరేణిలోని 11 ఏరియాల్లో గల కంపెనీ దవాఖానల్లో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటుతోపాటు క్వారంటైన్‌ కేంద్రాలుగా అన్ని ఏరియాల్లోని సీఈఆర్‌ క్లబ్‌లు, కమ్యూనిటీ హాళ్లు, సింగరేణి పాఠశాలలు తదితర భవనాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఆదేశాలతో డైరెక్టర్‌ (పా) చంద్రశేఖర్‌ అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి వ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్వారంటైన్‌ సెంటర్‌లో ఓ డాక్టర్‌, అవసరమైన వైద్యసిబ్బంది ఉండి 24 గంటలు వైద్యసేవలు అందిస్తారని పేర్కొన్నారు. అత్యవసర సేవలందించడానికి సంస్థ హైదరాబాద్‌లోని మూడు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలతో అంగీకారం కుదుర్చుకున్నదని వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా కరోనా సోకిన వారి వైద్యం కోసం ఖరీదైన మందులను అందుబాటులో ఉంచుతున్నామని, ఒక్కొక్కటి రూ.14వేల విలువ గల యాంటీ వైరల్‌ డోసులను కూడా సంస్థ సమకూర్చుతున్నదని వివరించారు. కార్మికులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ బారినపడితే పూర్తిస్థాయి వైద్య సేవలందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వైద్య సిబ్బందికి రూ.50లక్షల బీమా, నెల జీతం బేసిక్‌పై 10 శాతం అలవెన్సు ఇప్పటి నుంచి చెల్లిస్తుందని తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే సంబంధిత గనిని కూడా మూసివేస్తామని, గనులపై యూనియన్ల గేట్‌ మీటింగ్‌లకు రెండునెలల పాటు అనుమతించబోమని తెలిపారు. కరోనా వ్యాధి సోకిన కార్మికులకు ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్మికుల కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో సూచించారు.