బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jul 17, 2020 , 02:06:06

ప్రజలు భయాందోళన చెందవద్దు

ప్రజలు భయాందోళన చెందవద్దు

  • n  జిల్లాలో కరోనా టెస్టులు పెంచుతాం
  • n  హుజూరాబాద్‌లోనూ  ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు
  • n  ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
  • n   కలెక్టర్‌ శశాంక
  • n  మేయర్‌తో కలిసి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

కార్పొరేషన్‌: నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్‌ శశాంక సూచించారు.  నగరంలోని బోయవాడ, కట్టరాంపూర్‌, కాపువాడ, హుస్సేనీపుర, తదితర ప్రాంతాల్లో గురువారం ఆయన మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మేరకు జిల్లాలో, నగరంలో కరోనా టెస్టులను పెంచినట్లు తెలిపారు. నగరంలో పాజిటివ్‌ వచ్చిన వారి ఇంట్లోనే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కు ధరించాలని, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా కరీంనగర్‌తో పాటు జమ్మికుంట, హుజూరాబాద్‌ ప్రాంతాల్లో వస్తున్నందున ప్రభుత్వ దవాఖానలో 100 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా మరో 50 పడకలు ఏర్పాటు చేసి, 50 పడకలకు ఆక్సిజన్‌, 27 పడకలకు ఐసీయూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరీంనగర్‌కు అందుబాటులో రెండు ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలు ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు వాటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కరోనా బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని, అత్యవసర పరిస్థితులు, 60 ఏళ్లు పైబడిన వారిని మాత్రమే దవాఖానకు పంపిస్తామన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి ఫిజీషియన్‌తో ఫోన్‌ ద్వారా కాంటాక్ట్‌ అవడానికి అవకాశం ఉందన్నారు. ఇంట్లో ఉండడానికి వసతి లేని బాధితుల కోసం శాతవాహన యూనివర్సిటీలో 400 పడకలు, ఇండిపెండెంట్‌ గదులు కూడా ఏర్పాటు చేశామన్నారు. మైల్డ్‌ సింటమ్స్‌ ఉన్న వారిని ప్రభుత్వ దవాఖానలో, పరిస్థితి తీవ్రంగా ఉంటే ఎంజీఎం, గాంధీ దవాఖానకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానకు ట్రూనాట్‌ అండ్‌ సిబినాట్‌ మిషన్లను పంపించిందని, ఐసీఎంఆర్‌ లాగిన్‌ మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానలో రోజుకు 100 నుంచి 150 శాంపిల్స్‌ తీసుకుంటున్నట్లు తెలిపారు. చల్మెడ ఆనందరావు దవాఖానలో 50 నుంచి 60 శాంపిల్స్‌ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చొరవతో 1750 యాంటిజన్‌ టెస్టులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రతి రోజూ పాజిటివ్‌ కేసులను డీఎంహెచ్‌వో నుంచి డీపీఆర్వో ద్వారా బులెటిన్‌ విడుదల చేస్తున్నామని, ఏ ప్రాంతం  నుంచి వచ్చిందనే విషయాన్ని నగరపాలక సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల  సహకారంతో కరోనా వైరస్‌ను కట్టడి చేస్తామని తెలిపారు. మేయర్‌ వై సునీల్‌రావు మాట్లాడుతూ నగరంలో ఎక్కడ కూడా ఆందోళనకర పరిస్థితులు లేవన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దన్నారు. అధికార యంత్రాంగం  సిద్ధంగా ఉందని, ఎవరూ భయాందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, డీఎంహెచ్‌వో సుజాత, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ రమేశ్‌, కార్పొరేటర్‌ కమల్‌జిత్‌కౌర్‌, నేతికుంట యాదయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.