ఆదివారం 06 డిసెంబర్ 2020
Peddapalli - Jul 17, 2020 , 02:06:28

పీహెచ్‌సీల్లో కరోనా టెస్ట్‌లు

పీహెచ్‌సీల్లో కరోనా టెస్ట్‌లు

  • వైరస్‌ కట్టడికి రాష్ట్ర సర్కారు చర్యలు
  • 4,700 ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్ట్‌ కిట్లు 
  • నమూనాలు సేకరించిన అరగంటలోపు ఫలితం
  • ఇప్పటికే కరీంనగర్‌, హుజూరాబాద్‌లో ప్రారంభం 
  • త్వరలో అన్ని చోట్లా నిర్ధారణ 

కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు విస్తృత చర్యలు చేపడుతున్నది. హైదరాబాద్‌, జిల్లాకేంద్రాలకు పరిమితమైన నిర్ధారణ పరీక్షలను, తాజాగా క్షేత్రస్థాయికి చేరువ చేస్తున్నది. అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు ఇప్పటికే 4700 కిట్లు రాగా, కరీంనగర్‌, హుజూరాబాద్‌ దవాఖానల్లో ఇప్పటికే పరీక్షలు ప్రారంభించారు. నాలుగైదు రోజుల్లో పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో టెస్ట్‌లు చేయనున్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. మరోపక్క కొవిడ్‌-19 తీవ్రత తక్కువ ఉన్న వారిని ఇండ్లలో ఉంచుతూ, హోం ఐసొలేషన్‌ కిట్లు అందిస్తున్నారు. 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/ హెల్త్‌:  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. దీనిని ప్రాథమికంగానే అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలకు పూనుకుంటున్నది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంతోపాటు హుజూరాబాద్‌లో ఇప్పటికే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, మండల స్థాయిలోనూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. గతంలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించిన విధంగానే కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించబోతున్నది. ఇందుకు ర్యాపిడ్‌ యాంటిజన్‌ విధానాన్ని ఎంచుకుంది. 

నిర్ధారణ.. నివారణ..

కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుందనుకున్న వైరస్‌ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. ఎక్కడ చూసినా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ఎక్కడికక్కడ నిర్వహించి త్వరగా నివారించాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. అత్యవసర వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారికి వైద్యం చేయాలంటే సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించి వారికి అత్యవసర సేవలు అందించడమే కాకుండా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దోహద పడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో మొదలైన టెస్ట్‌లు.. 

కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని ప్రధాన దవాఖానలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. 70లక్షల వ్యయంతో ట్రూనాట్‌, సీబీ నాట్‌ మిషన్లు వినియోగిస్తున్నారు. అయితే ఇక్కడ ఫలితాలు రావడానికి కనీసం 3 నుంచి 4 గంటలు పడుతున్నది. అదే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ర్యాపిడ్‌ కిట్ల్లతో కేవలం అర గంటలో ఫలితాలు రానున్నాయి. వైరస్‌ నిర్ధారణ త్వరగా తెలిసే అవకాశాలు ఉన్నందున ఈ విధానంలో మండల స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రసూతి సేవల కోసం, ఇతర అత్యవసర శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల కిందటే కరీంనగర్‌, హుజూరాబాద్‌ ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు ప్రారంభించారు. గురువారం వరకు 50 టెస్టులు చేయగా, 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 2,050 ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టు కిట్లు వచ్చాయి. ఇందులో కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు 500, హుజూరాబాద్‌ దవాఖానకు 500, జమ్మికుంట, చొప్పదండి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు 250 చొప్పున, జిల్లాలోని 16 పీహెచ్‌సీలు, మరో 6 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు 25 చొప్పున 550 కిట్లు అందించారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌లో మూడు రోజుల కిందనే పరీక్షలు ప్రారంభించగా, మిగతా చోట్ల నాలుగైదు రోజుల్లో నిర్ధారణ పరీక్షలు ప్రారంభిస్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు.

జగిత్యాల జిల్లాకు 1550..

జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 22 పీహెచ్‌సీలతోపాటు, జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖాన, మెట్‌పల్లి ఏరియా దవాఖాన, కోరుట్ల సామాజిక దవాఖానలో సైతం ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలను చేయనున్నారు. దీని కోసం 1550 ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టింగ్‌ కిట్లను ప్రభుత్వం అందజేసింది. జగిత్యాల ఏరియా దవాఖానకు 500, మెట్‌పల్లి ఏరియా దవాఖానకు 250, కోరుట్ల దవాఖానకు 250 కిట్లను జిల్లా అధికారులు కేటాయించారు. అలాగే జిల్లాలోని 22 పీహెచ్‌సీలకు 25 కిట్ల చొప్పున పంపిణీ చేశారు. ర్యాపిడ్‌ యాంటిజన్‌ కిట్ల ద్వారా కొవిడ్‌-19 నిర్ధారించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అనుమానితుల నమూనాలను సేకరించి, ర్యాపిడ్‌ యాంటిజన్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. 15 నిమిషాల నుంచి అరగంట వ్యవధిలో కరోనా నిర్ధారణ జరుగుతుంది. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 889 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 105 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరు మృతి చెందారు. 76 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 27 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 25 మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రైవేట్‌ దవఖానలో, మరొకరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే 9392775359 నంబర్‌లో సంప్రందించాలని అధికారులు తెలియజేశారు.  

రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1100

ఇక్కడ జిల్లా ప్రధాన దవాఖానలోనే ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు 50 నుంచి 70 మంది వరకు ఈ పరీక్షలు చేస్తారు. జిల్లాకు ఇప్పటి వరకు 1100ల ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టింగ్‌ కిట్లు ప్రభుత్వం నుంచి వచ్చాయి. సిరిసిల్ల ఏరియా దవాఖానలో 500ల కిట్లు అందుబాటులో ఉంచారు. మిగిలినవి మండలాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచారు. సిరిసిల్ల ప్రధాన దవాఖానలోని సమావేశ మందిరాన్ని కొవిడ్‌-19 పరీక్షా కేంద్రంగా మార్చారు. అందులో ప్రతిరోజూ పరీక్షలు చేస్తున్నారు.

పీహెచ్‌సీలకు పంపిణీ చేశాం

ర్యాపిడ్‌ యాంటిజన్‌ కిట్లను పీహెచ్‌సీలకు పంపిణీ చేశాం. వాటిలోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాం. సిబ్బందికి, పరీక్షల నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో శిక్షణ ఇస్తాం. పూర్తి చేసుకున్న తర్వాత పీహెచ్‌సీలో నిర్ధారణ పరీక్షలు ప్రారంభిస్తాం. హోం ఐసోలేషన్‌లో ఉన్న 27 మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.

- పుప్పాల శ్రీధర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో (జగిత్యాల)