శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jul 16, 2020 , 02:37:54

ఎఫ్‌సీఐకి మిల్లింగ్‌ రైస్‌ను అందించాలి

ఎఫ్‌సీఐకి మిల్లింగ్‌ రైస్‌ను అందించాలి

  • అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

పెద్దపల్లిరూరల్‌: ఎఫ్‌సీఐకి పెండింగ్‌ ఉన్న మిల్లింగ్‌ రైస్‌ను అందించాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ ఆదేశించారు. కస్టం మిల్లింగ్‌ రైస్‌ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలోని చాంబర్‌లో ఆయన బుధ వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, 2019-20 వానకాలం పంటకు సంబంధించి 85 రైస్‌ మిల్లుల పరిధిలో 32 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉంద ని తెలిపారు. వీటిని త్వరితగతిన అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్‌ డెలివరీ సకాలంలో చేయని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేశం, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ప్రవీణ్‌, రైస్‌మిల్‌ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలను పరిష్కరించాలి 

జిల్లాలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌ డిజిటల్‌ సంతకాల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. భూ సమస్యలు, పెండింగ్‌ డిజిటల్‌ సంతకాల ప్రక్రియ, ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని వివరించారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మీ సేవ మ్యూటేషన్‌, సక్సేషన్‌ దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మండలాల వారీగా వచ్చిన వాటిపై తీసుకున్న చర్యల వివరాలను అదనపు కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీసీలో ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.