శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jul 16, 2020 , 02:37:55

కరోనా బాధితులను హోం ఐసొలేషన్‌లో ఉంచాలి

 కరోనా బాధితులను హోం ఐసొలేషన్‌లో ఉంచాలి

  •   కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌ హెల్త్‌ : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో కరోనా నివారణకు చేపడుతున్న చర్యలపై బుధవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసొలేషన్‌లో పెట్టాలన్నారు. ఇంటి వద్ద వసతులు లేని వారిని శాతవాహన యూనివర్సిటీలోని ఐసొలేషన్‌కు పంపించాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.  ఐసొలేషన్‌లో పనిచేసే ప్రతి వైద్యుడికి పీపీఈ కిట్స్‌ అందించాలని, కొవిడ్‌-19 బాధితులకు ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌లను ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉంచాలని, దవాఖానలో బెడ్ల వివరాలు తెలపాలని సూచించారు. ఆక్సిజన్‌ ఉన్న అంబులెన్స్‌లు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నవి, తదితర వివరాలు అందించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్లతో పాటు ప్రతి గ్రామానికి పల్స్‌ ఆక్సిజన్‌ మీటర్లు కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో విధులు నిర్వహించి రిటైర్ట్‌ అయిన వైద్యాధికారుల వివరాలు సేకరించాలన్నారు. బాధితులు దురదృష్టవశాత్తు మరణిస్తే ప్యాక్‌ చేసేందుకు డెడ్‌ బ్యాగ్స్‌ కొనుగోలు చేయాలన్నారు. పీపీఈ కిట్స్‌, ఎన్‌-95 మాస్కులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో వెంకటమాధవరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, డాక్టర్లు రవీందర్‌రెడ్డి, నాగశేఖర్‌, అలీం, తదితరులు పాల్గొన్నారు.