ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jul 15, 2020 , 02:26:08

‘ఉజ్వల’ ప్రతిభ

‘ఉజ్వల’ ప్రతిభ

  • శాస్త్రీయ నృత్యంలో రాణిస్తున్న ఖని బిడ్డ 
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా 
  • అనేక పురస్కారాలు సొంతం
  • ‘నృత్య ఖని’ స్థాపించి పలువురికి విద్యాదానం

కూచిపూడిపై ఉన్న మక్కువ. ఆమెను నాట్యమయూరిగా మార్చింది. తొలుత విలక్షణ డ్యాన్సర్‌గా అడుగులు వేసినప్పటికీ తర్వాత శాస్త్రీయ నృత్యంలో పట్టుసాధించి, అంచలంచెలుగా ఎదుగుతున్నది ఖనికి చెందిన ఉజ్వల. సంగీత విద్యను అభ్యసించడంతోపాటు మాస్టర్స్‌ కూడా పూర్తి చేసి గోల్డ్‌మెడల్‌ను అందుకున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ అనేక పురస్కారాలను కైవసం చేసుకోవడంతోపాటు స్థానికంగా నృత్య పాఠశాలను ఏర్పాటు చేసి ఎందోమంది చిన్నారులు, యువతులకు తర్ఫీదు ఇస్తున్నది.  - కోల్‌సిటీ 

గుమ్మడి ఉజ్వల. ఖని ప్రాంతంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తల్లిదండ్రులు పెద్దులు- నిర్మలాదేవి. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కొడుకు. చిన్న కూతురైన ఉజ్వలకు బాల్యం నుంచే డ్యాన్స్‌ అంటే మక్కువ. సింగరేణి కార్మిక కుటుంబం కావడంతో సింగరేణి స్కూల్‌లో ప్రాథమిక విద్య, ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌, స్థానిక ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం మంథని సంగీత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆమె తన సమీప బంధువు నర్సయ్య వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూచిపూడిపై డిప్లొమా చేయడంతోపాటు 2014లో సెంట్రల్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ కూడా కంప్లీట్‌ చేసి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నది. 

నాట్య మయూరిగా పేరు..

తొలుత విలక్షణ నృత్యకారిణిగా రాణించిన ఉజ్వల తర్వాత కూచిపూడిపై పట్టుసాధించి అబ్బురపరుస్తున్నది. ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఖని ఆణిముత్యంగా పేరు పొందింది. తెలంగాణ ప్రభుత్వం తరపున బతుకమ్మ పండుగపై 2018లో వారం రోజుల పాటు మలేషియాలో ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే 2018లో న్యూఢిల్లీలో జరిగిన కళోత్సవాల్లో జాతీయ అవార్డు రావడం ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. తెలంగాణ కరెంట్‌ ఎఫైర్స్‌లో ‘తెలుగు తేజం అవార్డు గ్రహీత ఎవరు..’ అన్న ప్రశ్నకు జవాబుగా ఉజ్వల పేరు ఉండడం విశేషం. దీంతో ఆమె రామగుండం నగర పాలక సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ కూచిపూడి కళాకారుడు వేదాంతం రాఘవయ్య శత జయంతి ఉత్సవాల్లో 1950 నాటి చిత్రం ‘స్వప్న సుందరి’లోని ఓ నృత్యాన్ని తన గ్రూపు సభ్యులతో ప్రదర్శించి సభికులను ఔరా అనిపించింది. 

‘నృత్య ఖని’ ద్వారా శిక్షణ..

శాస్త్రీయ నృత్యంలో రాణిస్తున్న ఉజ్వల తనలా మరికొంత మందిని తయారు చేసి అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోయాలని భావించింది. ఈ క్రమంలో 2014లో కోదండ రామాలయంలో నృత్య ఖని పాఠశాలను స్థాపించి, ఎంతోమంది చిన్నారులు, యువతులకు తర్ఫీదు ఇస్తున్నది. ఇదే పాఠశాలలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిని దత్తత తీసుకొని తన తర్వాత సామాజిక విలువలతో శాస్త్రీయ నృత్యంలో రాణించేలా శిక్షణ ఇస్తున్నది. 

నా వంతు కృషి చేస్తున్నా..

కోల్‌బెల్ట్‌ ప్రాంతాన్ని కళాక్షేత్రంగా తీర్చిదిద్దాలని ఉన్నది. 2018లో మలేషియాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో వారం రోజులపాటు పాల్గొన్న సందర్భం ఎప్పటికీ మరిచిపోలేను. అవార్డు, ప్రశంసలు కాదు నా తపనంతా. శాస్త్రీయ నృత్యం మరుగున పడకుండా కాపాడాలన్నదే నా ఆశయం. అందుకే గోదావరిఖనిలో ‘నృత్యఖని’ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి చాలా మందికి శిక్షణ ఇస్తున్నా. కళారంగంలో ఈ ప్రాంత పేరు నిలబెట్టేందుకు నావంతుగా కృషి చేస్తున్నా. - గుమ్మడి ఉజ్వల