శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Jul 15, 2020 , 02:26:09

హుజూరాబాద్‌లోనూ కరోనా టెస్టులు

హుజూరాబాద్‌లోనూ కరోనా టెస్టులు

  •   కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షా కేంద్రం
  •  బాధితులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలి
  •   డివిజన్‌లోని వైద్యులకు కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక ఆదేశాలు

హుజూరాబాద్‌టౌన్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శశాంక తెలిపారు. ఇక్కడ కరోనా బాధితులకు సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాల మేరకు ఏరియా దవాఖానను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లోని గదులను, ఐసొలేషన్‌ సెంటర్‌ ఏర్పాట్లను ఆయన క్షుణ్నంగా పరిశీలించి, సూపరింటెండెంట్‌ రవిప్రవీణ్‌రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్‌లోని వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌-19 రోగుల కోసం 50 నుంచి 100 వరకు పడకలను ఏర్పాటు చేసేందుకు ఇక్కడి వైద్యులు, సిబ్బంది అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. సమగ్ర నివేదికలు వచ్చాక ఎన్ని పడకలు ఏర్పాటు చేసే విషయం నిర్ధారిస్తామన్నారు. కలెక్టర్‌ వెంట హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలోం, డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్‌ రత్నమాల, హుజూరాబాద్‌, జమ్మికుంట దవాఖానల సూపరింటెండెంట్లు రవిప్రవీణ్‌రెడ్డి, అనితారెడ్డి, ఆర్‌ఎంవో పీ శ్రీకాంత్‌రెడ్డి, వైద్యులు, తదితరులు ఉన్నారు.