సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jul 14, 2020 , 03:37:54

జలాలపై ‘సౌర కాంతి’

జలాలపై ‘సౌర కాంతి’

  • ప్రాజెక్టుల వద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు  
  • నీటిలో తేలియాడే పలకల  ఆధారంగా విద్యుదుత్పత్తికి సింగరేణి సమాలోచనలు 
  • హైదరాబాద్‌లో  సీఎండీ శ్రీధర్‌ సమీక్ష

బొగ్గు వెలికితీతలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే థర్మల్‌, సౌర విద్యుత్‌లోకి అడుగిడి సత్ఫలితాలు సాధిస్తున్న సంస్థ, అదే ఉత్సాహంతో జలాశయాలలో నీటిలో తేలియాడే సోలార్‌ పలకల ఆధారంగా విద్యుదుత్పత్తికి సంకల్పిస్తున్నది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీ శ్రీధర్‌ అధికారులతో సమీక్షించి, పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 500 మెగావాట్లకు ప్రణాళికలు వేస్తూనే, అంత మొత్తాన్ని ఒకే ప్లాంట్‌ ఆధారంగా ఉత్పత్తి చేయాలా..? లేక 100 మెగావాట్ల చొప్పున పెట్టాలా.. అని అధ్యయనంతోపాటు ప్రతిపాదనలు తయారు చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. 

 - గోదావరిఖని

సింగరేణి యాజమాన్యం భారీ జలాశయాలపై తేలియాడే సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీ శ్రీధర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. నీటిపై తేలియాడే 500 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం కంపెనీ, రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయంతో ప్రతిపాదనలపై చ ర్చించారు. మొత్తం సామర్థ్యం గల ప్లాంట్‌ను ఒకేసారి.. ఒకేచోట నిర్మించే వీలుందా.. లేక, 100 మెగావాట్ల సామర్థ్యంతో 5 దశలుగా ఏర్పాటు చేసే అవకాశముందా అనే అంశాలపై అధ్యయనం చేశారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లోని భారీ సాగునీటి జలాశయాలు ప్లాంట్ల నిర్మాణానికి అణువుగా ఉన్నట్లు చర్చించారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరుపడానికి నిర్ధిష్ట ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా కోరారు. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే 11 ఏరియాల్లో సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టిన సింగరేణి.. ప్రస్తుతం నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి అడుగులు వేస్తున్నది. ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. దీంతో పాటు విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించిన అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశం లో డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) ఎస్‌ శంకర్‌, రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవల ప్‌మెంట్‌ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్‌ రామకృ ష్ణ, తదితరులు పాల్గొన్నారు.