సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jul 13, 2020 , 02:00:21

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

పెద్దపల్లి రూరల్‌: ప్రజల ప్రాణాలను హరించే విధంగా మారిన కరోనా మహమ్మారిని అరికట్టడం కేవలం స్వీయ నియంత్రణతోనే సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో ఆదివారం స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్దపల్లి ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపల్లి పట్టణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుందన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు కరోనాతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు పెద్దపల్లిలో పది రోజుల పాటు స్వీయ నిర్బంధం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇలాంటి ఆపత్కాలంలో షాపింగులు మానుకోవాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలంతా అవసరాల నిమిత్తమే పెద్దపల్లికి రావాలని, కాలక్షేపాలకు పెద్దపల్లిలో తిరుగుతూ కరోనాను కొనితెచ్చుకోవద్దన్నారు. రైతులు క్రిమిసంహారక మందులు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటింటాలని చెప్పారు. పట్టణంలో కరోనాతో ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో ప్రజలంతా పది రోజుల పాటు స్వీయ నిర్బంధం పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. కిరాణా, మెడికల్‌, ఇతర వ్యాపారవర్గాలన్నీ కరోనా నియంత్రణ నేపథ్యంలో నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. సమావేశంలో ఎంపీపీలు బండారి స్రవంతి, నూనేటి సంపత్‌ యాదవ్‌, కౌన్సిలర్లు పురుషోత్తం, భిక్షపతి, దేవనంది రమాదేవి, సురేశ్‌బాబు, పూదరి చంద్రశేఖర్‌, నాయకులు రాజు, రవి, శ్రీధర్‌ పాల్గొన్నారు.