శనివారం 08 ఆగస్టు 2020
Peddapalli - Jul 13, 2020 , 01:44:58

కార్మికులకు అండ.. గులాబీ జెండా

కార్మికులకు అండ.. గులాబీ జెండా

గోదావరిఖని: రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్‌ ఉన్నంతకాలం సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వడనీ, టీబీజీకేఎస్‌ యూనియన్‌తోనే గని కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరిఖనిలోని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో బీఎంఎస్‌ నుంచి పలువురు నాయకులు టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానించి మాట్లాడారు. గతంలో ప్రైవేటీకరణకు ఆజ్యం పోసిన జాతీయ సంఘాలే ఇప్పుడు అడ్డుకుంటామని కార్మిక వర్గాన్ని మళ్లీ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 41 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడంతో ఆ పార్టీ రంగు బయటపడిందనీ, ఈ నేపథ్యంలోనే బీజేపీ అనుబంధ బీఎంఎస్‌ నుంచి ముఖ్య నాయకులంతా బయటకు రావడం, టీబీజీకేఎస్‌లో చేరడం శుభ సూచికమన్నారు. యావత్‌ గని కార్మికులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను విశ్వసిస్తున్నారనీ, సింగరేణి గని కార్మికులంటే సీఎం కు కూడా అమితమైన అభిమానం ఉందన్నారు. అందుకే జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియామకాల ద్వారా అమలు చేయించి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.

బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకునే సత్తా కూడా ఒక్క టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌కే ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ సంస్కరణల నేపథ్యంలో కార్మిక వర్గమంతా ఒకతాటిపై ఉండాలని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ.వెంకట్రావు అన్నారు. ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. యూనియన్‌లో సమర్థత కలిగిన వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అందరూ ఒకతాటిపై ఉండి యూనియన్‌ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులపై ఉన్న ప్రేమతో కారుణ్య నియామకాలను తిరిగి సాధించారన్నారు. ఈ కార్యక్రమాల్లో సమావేశంలో రామగుండం నగర మేయర్‌  బంగి అనిల్‌కుమార్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, నాయకులు జాహీద్‌ పాషా, గండ్ర దామోదర్‌రావు, కనకం శ్యాంసన్‌, నూనె కొంరయ్య, శంకర్‌నాయక్‌, ఐలి శ్రీనివాస్‌, కృష్ణ తదితరులున్నారు. logo