మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jul 11, 2020 , 01:30:35

ఆటోమేటిక్‌ శానిటైజర్‌

ఆటోమేటిక్‌ శానిటైజర్‌

మంథనిటౌన్‌: కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. బయటికి వెళ్లాలంటేనే వణుకుపుట్టిస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చిందోగాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖానికి మాస్క్‌, సూక్ష్మ వినాశక రసాయనాలు చాలా రకాలు వినియోగిస్తున్నాం. కానీ ఎంత చేసినా శానిటైజర్‌ బాటిల్‌ను ముట్టుకోనిదే చేతుల్ని శుభ్రం చేసుకోలేకపోతున్నాం. మరోమార్గం ఏదైనా ఉంటే బాగుండని అనుకుంటున్నాం. కానీ ఈ సమస్యకు మంథనికి చెందిన యువకుడు వంశీకృష్ణ చక్కటి పరిష్కారం కనుగొన్నాడు. అతి తక్కువ ఖర్చుతో వీపీసీ శానిటైజర్‌ మిషన్‌ తయారీ చేసి, ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

ముట్టుకోకుండానే చేతుల్లోకి శానిటైజర్‌

పట్టణంలోని నాయీబ్రాహ్మణ వీధికి చెందిన మంథని వంశీకృష్ణ హైదరాబాద్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. రోజురోజుకూ వైరస్‌ విజృంభిస్తుండడం, అందులో రోజూవారీ పనులు చేసుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటుండడంతో వారి కోసం ఆటోమెటిక్‌ శానిటైజర్‌ మిషన్‌ను తయారు చేయాలని అనుకున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో ఆటోమెటిక్‌ ఐరన్‌ శానిటైజేషన్‌ మిషన్లు దొరుకుతున్నా ధర వేలల్లో ఉండడంతో అతి తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నాడు. కాస్త వినూత్నంగా ఆలోచించి ప్లాస్టిక్‌ పైపులతో కేవలం రూ. 500 ఖర్చుతో వీపీసీ శానిటైజేషన్‌ మిషన్లు తయారు చేసి స్థానిక చిరువ్యాపారులకు అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు.