శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jul 10, 2020 , 02:35:30

ఊరంతా సన్నాలే..

ఊరంతా సన్నాలే..

  • l పాతికేళ్లుగా సన్నరకాలే సాగు
  • l పూర్తిగా 460 ఎకరాల్లో వరి 
  • lభూగర్భ జలాల ఆధారంగా ఎవుసం
  • lకేసీఆర్‌ పిలుపుతో మరికొన్ని గ్రామాల్లో చైతన్యం 
  • lమృగశిర కార్తె నుంచే సాగుబాట 
  • lసర్కారు ఫలాలూ సద్వినియోగం
  • lఆదర్శంగా నిలుస్తున్న రైతాంగం
  • నర్సింహులపల్లిలో వ్యవసాయ విప్లవం..

ధర్మారం : పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరాన ధర్మారం మండలంలో ఉంటుందీ నర్సింహులపల్లి. గ్రామ జనాభా 1080. ఆ ఊళ్లో అందరూ రైతులే. దాదాపు 168 రైతు కుటుంబాలున్నాయి. గ్రామంలో 560 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఊళ్లో ఏం చేసినా అందరూ కలిసే చేస్తారు. అందరి రైతుల్లాగానే మొదట దొడ్డురకమే సాగు చేసేవారు. అయితే వానకాలంలో ఆశించిన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. సన్నాల సాగు బాట పట్టారు. ఆ సమయంలో దొడ్డు రకాలకంటే సన్నాలకే మార్కెట్‌లో మద్దతు ధర వచ్చేది. దీంతో సాగులో మెళకువలు, మార్కెట్‌లో వాటి రేటు గురించి తెలుసుకొని ఊరు ఊరంతా ఏటా వానకాలంలో సన్నరకం, యాసంగిలో దొడ్డు రకం వేస్తున్నారు. 

పూర్తిగా భూగర్భ జలాలతోనే సాగు.. 

నర్సింహులపల్లిలోని భూములన్నీ ఎస్సారెస్పీ చివరి ఆయకట్టులో ఉంటాయి. గ్రామంలో నుంచి డీ83 11ఎల్‌ 1-ఆర్‌ కెనాల్‌ వెళ్తున్నా చివరి భూములు కావడంతో ఎప్పుడూ సరిపడా నీరందేది కాదు. దీంతో రైతులంతా కెనాల్‌ నీటి కోసం ఎదురుచూడకుండా కేవలం బోర్లు, బావులపై ఆధారపడే సాగు చేస్తున్నారు. ఇలా ఒకటికాదు రెండు కాదు మొత్తం 460 ఎకరాల్లో వరి, 60 ఎకరాల్లో పత్తి వేస్తున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్సాహం..

నర్సింహులపల్లి రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో భరోసా లేని పాలనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, నిరంతర ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయంతో రందీ లేని ఎవుసం చేస్తున్నారు. గ్రామంలోని 168 మంది రైతులు మొత్తం 560 ఎకరాలల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 10 వేల చొప్పున సీజన్‌కు 28 లక్షలు అంటే ఏడాదికి 56 లక్షల సాయాన్ని పొందుతూ ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. 

దిగుబడి సిరులు.. 

గ్రామంలో పోటీపడి మరీ సన్నాలు సాగు చేస్తున్నారు. తెగుళ్లు, దోమపోటు ఉన్నా అదేమి పెద్ద సమస్య కాదని, కాస్త ఇగురంతో సాగు చేస్తే సిరులు కురిపించవచ్చని నిరూపిస్తున్నారు. దొడ్డు రకం ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడి వస్తే, సన్నరకం 30 క్వింటాళ్ల దాకా వస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరానికి 55,050 ఆదాయం వస్తుంది. పెట్టుబడి కింద 20వేలు పోయినా ఎకరానికి 35వేల వరకు నికర లాభం పొందుతున్నారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం గత వానకాలం సీజన్‌లో ఇక్కడి రైతులు 2 కోట్ల 53 లక్షల 23 వేల విలువైన 13,800 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించారు.

సార్‌ చెప్పింది చానా మంచిది.. 

నాకు ఐదెకరాల భూమి ఉన్నది. అందులో 3 ఎకరాలు తరి, 2 ఎకరాలు ఖుష్కి. 3 ఎకరాల్ల నేను 20 ఏండ్ల నుంచి సన్నాలే సాగు చేత్తన్న. సన్నాలు వేత్తే మస్తు తిప్పలైతదని అందరూ అనుకుంటరు. కానీ, అందులో ఎంత మాత్రం నిజం లేదు. కొంచెం ఇగురం చేస్తే దొడ్డుకంటే ఏడెనిమిది క్వింటాళ్లు ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. కేసీఆర్‌ పిలుపు నచ్చింది. అందుకే రైతులమంతా ప్రతిజ్ఞ చేసినం. ఇక నుంచి రెండు సీజన్లల్ల సన్నాలే వేస్తం.

- ఆకుల శ్రీహరి, రైతు (నర్సింహుపల్లి)

రేటు తగ్గినా అటువైపే మొగ్గు.. 

దిగుబడి, మార్కెట్‌లో రేటు చూసి సన్నాల బాట పట్టిన రైతులు, సన్నాలకు రేటు తగ్గినా.. దొడ్డురకంతో సమాన ధర ఉన్నా సాగును వదల్లేదు. రెండు దశాబ్దాల కింద సన్నాలకు మంచి రేటు ఉండేది. క్వింటాల్‌ దొడ్డు వడ్లకు 600 ధర ఉంటే సన్నం వడ్లకు 800 పలికేవి. ఆ తర్వాత కొన్నేండ్లకు దొడ్డు రకం 1,200కు చేరితే, సన్నాలకు 1,500 ధర వచ్చింది. దీంతో గ్రామంలో సన్న సాగువిస్తీర్ణం బాగా పెరిగింది. అయితే దొడ్డు రకానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం క్వింటాల్‌ దొడ్డురకం గ్రేడ్‌ ‘ఎ’కు ధర 1,835, కామన్‌ రకానికి 1,815గా ధర నిర్ణయించింది. ప్రస్తుతం సన్నాలకు గ్రేడ్‌ ‘ఏ’ దొడ్డు రకం ధరనే ప్రభుత్వం చెల్లిస్తున్నది. అయినా సన్న రకాల సాగులో లాభాలు చూసిన రైతులు ఇప్పటికీ అవే సాగు చేస్తూ సన్నాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అంతే కాదు వీరు పండించిన ధాన్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో నేరుగా వ్యాపారులే కల్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. 

20 ఏండ్లుగా సన్నాలే.. 

నాకు ఐదెకరాల భూమి ఉన్నది. నేను 20 ఏండ్ల నుంచి సన్న రకం వరే వేస్తున్న. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే దాకా కంటికి రెప్పలా కాపాడుకుంట. కొంచెం తెగుళ్లు వస్తయిగనీ దాంతో పెద్ద ఇబ్బందేమి లేదు. ఎప్పటికప్పుడు పంటను కాసుకొని ఉంటే మంచి దిగుబడి వస్తది. మా ఊరోళ్లమంతా సన్నరకం సాగే చేత్తం.

- కుమ్మరుకుంట మల్లయ్య, రైతు (నర్సింహులపల్లి) 

తోటి గ్రామాలకు ఆదర్శం.. 

సన్నాల సాగులో ఆదర్శంగా నిలుస్తున్న రైతులు, నియంత్రిత సేద్య విధానానికి దన్నుగా నిలిచారు. తోటి గ్రామాలలో చైతన్యం తెచ్చేందుకు సిద్ధమయ్యారు. మే 23న గ్రామానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆహ్వానించారు. బుచ్చయ్యపల్లి, కానంపల్లి గ్రామాల రైతులతో కలిసి నియంత్రిత సేద్యానికి కట్టుబడి ఉంటామని, ప్రతిజ్ఞ చేసి స్ఫూర్తినిచ్చారు.